తిట్టాడని చంపేశాడు.. | - | Sakshi
Sakshi News home page

తిట్టాడని చంపేశాడు..

Published Tue, Apr 1 2025 2:02 PM | Last Updated on Tue, Apr 1 2025 2:02 PM

తిట్ట

తిట్టాడని చంపేశాడు..

ఫైనాన్స్‌ వ్యాపారి దారుణ హత్య

సహజీవనం చేస్తున్న మహిళ కుమారుడి ఘాతుకం

చైతన్యపురి: తిట్టాడని డైలీ ఫైనాన్స్‌ వ్యాపారిని అతడితో సహజీవనం చేస్తున్న మహిళ కుమారుడు దారుణంగా హత్య చేసిన సంఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ సైదిరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..రంగారెడ్డి జిల్లా, పులిమామిడి గ్రామానికి చెందిన బచ్చు వెంకటేశ్వర్లు అలియాస్‌ రాజు (47) గత కొన్నాళ్లుగా కర్మన్‌ఘాట్‌లోని జానకీ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్నాడు. అతడి భార్య విడిపోవటంతో ఒక్కడే ఉంటూ డైలీ ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్నాడు. సూర్యాపేట జిల్లా శ్రీనివాసపురం గ్రామానికి చెందిన మామిడి గురవమ్మ భర్త మృతి చెందటంతో కుమారుడు పవన్‌, కుమార్తెతో కలిసి అదే ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు, గురవమ్మలకు పరిచయం ఏర్పడింది. గురవమ్మ కుమారుడు, కుమార్తె మరో ఇంట్లో ఉంటుండగా ఆమె వెంకటేశ్వర్లుతో సహజీవనం చేస్తోంది. గత కొద్ది రోజులుగా వెంకటేశ్వర్లు గురవమ్మ ఆమె కొడుకు, కుమార్తెను దూషిస్తున్నాడు. ఆదివారం ఉగాది పండుగ నేపథ్యంలో గురవమ్మ తన కుమారుడు, కుమార్తెను ఇంటికి పిలిచింది. రాత్రి వెంకటేశ్వర్లు, గురవమ్మ, పవన్‌ల మధ్య గొడవ జరగడంతో పవన్‌ కత్తితో వెంకటేశ్వర్లుపై దాడి చేశాడు. అనంతరం సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించాడు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్న వెంకటేశ్వర్లును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. హత్యకు పాల్పడిన పవన్‌ పరారీలో ఉన్నాడని, మృతుడి మేనల్లుడి ఫిర్యాదు మేరకు గురవమ్మతో పాటు ఆమె కుమారుడు పవన్‌, కుమార్తెలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

మహిళా రియల్టర్‌ అరెస్ట్‌

బంజారాహిల్స్‌: డిజిటల్‌ అరెస్టు పేరుతో మోసానికి పాల్పడిన కేసులో ఓ మహిళా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని సైబరాబాద్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..నగరానికి చెందిన ఓ బాధిరాలికి ముంబై బ్రాందాలోని కుర్లా పోలీస్‌స్టేషన్‌ నుంచి ఫోన్‌ చేస్తున్నామని, మీ పేరున ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్‌ ఖాతాలో అక్రమ లావాదేవీలు జరిగాయని, దీనిపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. ఇందుకోసం స్కైప్‌ కాల్‌ చేసిన అవతలి వ్యక్తి మనీలాండరింగ్‌ లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో మీరు పాల్గొన్నారో లేదో నిర్థారించుకుని, క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ అందజేస్తామని, ఇందుకోసం మీరు రూ.3,57,998 పంపించాలని, తిరిగి ఆ మొత్తాన్ని 24 గంటల్లోపు పంపిస్తామని నమ్మబలికారు. దీంతో బాధితుడు తన ఖాతాలో అంత మొత్తం లేకపోయినా రుణం తీసుకుని ఆ మొత్తాన్ని నిందితుడి ఖాతాకు బదిలీ చేశాడు. తాను ట్రాన్స్‌ఫర్‌ చేసిన నగదు రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించారు. గుంటూరు కాటవరానికి చెందిన ఫిజియోథెరపిస్ట్‌ తోట శ్రీనివాసరావు, జీవన్‌కుమార్‌, రఘువీర్‌లను గత నెల 25న అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న మహిళా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కొంపల్లికి చెందిన క్రోతపల్లి రితికను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, టెలిగ్రామ్‌, వాట్సప్‌ కాల్స్‌ ఆధారంగా మోసాలకు పాల్పడుతున్నట్లు తెలినారు. వారి నుంచి మూడు సెల్‌ ఫోన్లు, వివిధ బ్యాంకులకు చెందిన 9 చెక్కు బుక్‌లు, 3 పాస్‌బుక్‌లు, రెండు స్టాంపులు, ఒక క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌, మూడు ఏటీఎం కార్డులు, 5 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును సైబర్‌క్రైమ్‌ యూనిట్‌కు చెందిన ఎస్‌ఐ మన్మోహన్‌, హెడ్‌కానిస్టేబుల్‌ ఫిరోజ్‌, కానిస్టేబుల్‌ రాకేష్‌, మహిళా కానిస్టేబుల్‌ కుమ్‌భారవి బృందం దర్యాప్తు చేస్తుంది.

డీజిల్‌ లీకై రేంజ్‌ రోవర్‌ కారు దగ్ధం

కారులో నుంచి సురక్షితంగా బయటపడిన యువకులు

నార్కట్‌పల్లి : రేంజ్‌ రోవర్‌ కారు డీజిల్‌ ట్యాంకు లీకేజీ కావడంతో మంటలు ఎగిసిపడి కారు దగ్ధమైంది. ఈ ఘటన సోమవారం నార్కట్‌పల్లి– అద్దంకి హైవేపై నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు వద్ద జరిగింది. హైదరాబాద్‌కు చెందిన శివప్రసాద్‌, శివకుమార్‌, గోవర్ధన్‌ ముగ్గురు స్నేహితులు కలిసి గుంటూరులో ఓ ఫంక్షన్‌కు హాజరయ్యారు. సోమవారం అద్దంకి వద్ద పెట్రోల్‌ బంక్‌లో రేంజ్‌ రోవర్‌ కారుకు పెట్రోల్‌ పోయించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. చెర్వుగట్టు సమీపంలోకి రాగానే కారు డీజిల్‌ ట్యాంక్‌ లీకై చిన్నచిన్న మంటలు రావడాన్ని గుర్తించిన వారు కారును రోడ్డు పక్కన నిలిపి బయటకు వచ్చారు. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఆగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే కారు చాలా వరకు కాలిపోయింది. నార్కట్‌పల్లి ఎస్‌ఐ క్రాంతికుమార్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

తిట్టాడని చంపేశాడు.. 1
1/1

తిట్టాడని చంపేశాడు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement