తుర్కయంజాల్: పురపాలక సంఘం పరిధిలో మొత్తం 14,500 తాగునీటి కనెక్షన్లు ఉండగా, నిత్యం 78 లక్షల లీటర్ల సరఫరా అవసరం ఉంది. 68 లక్షల లీటర్లు మాత్రమే ఉండటంతో సరిపడా సరఫరా కావడం లేదు. దీంతో ప్రజలకు నీటి తిప్పలు తప్పడం లేదు. నెల రోజులుగా సరిపడా నీరు రాకపోవడంతో బోర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. బోరు నీటి వసతి లేని వారు ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. జలమండలి కానీ మున్సిపాలిటి కానీ ప్రత్యేకంగా ట్యాంకర్లను ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేటు ట్యాంకర్లను తెప్పించుకోక తప్పడం లేదు. మున్సిపాలిటీలో చేపడుతున్న పలు అభివృద్ధి పనుల కారణంగా నీటి స రఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. చాలా కాలనీల్లో సీసీ రోడ్లు, అంతర్గత డ్రైనేజీ నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో పైప్‌లైన్లు ధ్వంసం అవుతున్నాయి. జలమండలి అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టకపోవడంతో పలు చోట్ల రోజుల తరబడి సరఫరా నిలిచిపోతోంది. దీనిపై జలమండలి మేనేజర్ వినయ్‌ను వివరణ కోరగా పైప్‌లైన్‌ల మరమ్మతులను వేగంగా చేపడుతున్నామని, అదనంగా సిబ్బందిని సైతం నియమించుకున్నట్టు తెలిపారు. నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.