రాజేంద్రనగర్: పదో తరగతి పరీక్షలు సజావుగా జరిగేలా అధికారులు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. రాజేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ సరళిని పరిశీలించారు. వేసవి అయినందున విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. పరీక్ష కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. మెయిన్ గేట్ వద్ద విద్యార్థినీ విద్యార్థులను వేర్వేరుగా తనిఖీ చేసి పరీక్ష కేంద్రంలోకి పంపాలని పోలీసులకు సూచించారు. పరీక్ష కేంద్రంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని చీఫ్ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. ఆయన వెంట జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్‌రావు, పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ తదితరులు ఉన్నారు.