మొయినాబాద్: హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై రాత్రి సమయంలో అంధకారం అలముకుంటోంది. రహదారి పొడువునా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినా నిర్వహణ సరిగా లేకపోవడంతో అవి వెలగడం లేదు. మున్సిపల్ కేంద్రంతోపాటు జేబీఐటీ కళాశాల నుంచి అప్పా జంక్షన్ వరకు ఏర్పాటు చేసినవి అలంకారప్రాయంగా మిగిలాయి. మున్సిపల్ కేంద్రంలో హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై గతంలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. నిర్వహణ సరిగా లేకపోవడంతో అవి వెలిగిన దాఖలాలు లేవు. పంచాయతీ ఉన్నప్పుడు ఒకసారి మరమ్మతులు చేయించినా మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. తరువాత తిరిగి వాటిని పట్టించుకునేవారే కరువయ్యారు. జేబీఐటీ కళాశాల నుంచి అప్పా జంక్షన్ వరకు రెండేళ్ల క్రితం కొత్తగా రోడ్డు మధ్యలో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. కొన్ని రోజులపాటు వెలిగాయి.. నాలుగైదు నెలలుగా వెలగడం లేదు. గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన వీధిదీపాలు కొన్నిచోట్ల బాగానే పనిచేస్తున్నా మరి కొన్ని చోట్ల వెలగడం లేదు. ప్రస్తుతం మున్సిపాలిటీ ఏర్పాటు కావడంతో నిర్వహణ మున్సిపల్ అధికారులు చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మున్సిపల్ అధికారులు వీటిపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు.
విద్యుత్ బిల్లులు పెండింగ్..
మూడు నెలల క్రితం వరకు పంచాయతీలుగా ఉన్న 8 గ్రామాలతో మున్సిపాలిటీ ఏర్పడింది. అప్పటి వరకు పంచాయతీల పేరుతో విద్యుత్ బిల్లులు వచ్చేవి. ప్రస్తుతం మున్సిపాలిటీ ఏర్పడినా ఇంకా పంచాయతీల పేరుతోనే వస్తున్నాయి. విద్యుత్, మున్సిపల్ అధికారుల సమన్వయంతో బిల్లులు మార్చాల్సి ఉంది. రూ.లక్షల్లో విద్యుత్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
వెంటనే స్పందిస్తున్నాం
హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. రహదారి మధ్యలో గతంలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు తొలగించే అవకాశం ఉంది. ప్రస్తుతం కొన్ని వెలగడంలేదు. విస్తరణలో తొలగిస్తారనే మరమ్మతులు చేయించడంలేదు. వీధుల్లో మాత్రం ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే స్పందిస్తున్నాం. – ఖాజా మొయిజుద్దీన్, కమిషనర్