ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల మున్సిపాలిటీలోని 15 వార్డుల్లో వీధి దీపాల నిర్వహణ అధ్వానంగా మారింది. ఎప్పుడు వస్తాయో.. ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితి. ఒక్కోసారి పట్ట పగలే వెలుగులు విరజిమ్ముతాయి. మరోసారి రాత్రిళ్లు కూడా అంధకారం నెలకొంటోంది. బల్బులు పోతే మార్చడానికి రోజులు పడుతోంది. మున్సిపాలిటీలో 4,189 వీధి దీపాలు ఉన్నాయి. వీటి నిర్వహణ ఈఈఎస్‌ఎల్ ఏజెన్సీ చూసుకో వాల్సి ఉంది. ప్రతీ నెల వీరికి రూ.2.6 లక్షలు మున్సిపాలిటీ చెల్లిస్తోంది. వీధి దీపాలు, బోర్లు అన్నింటికీ కలిపి ఏటా విద్యుత్ శాఖకు రూ.7లక్షలు బిల్లు చెల్లిస్తోంది. ఈ ఏడాది ఇంకా చెల్లించలేదు. వీధి దీపాల నిర్వహణ, మరమ్మతుల బాధ్యత ఈఈఎస్‌ఎల్ సంస్థదే. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఈ సంస్థ చేతులెత్తేసింది. దీంతో పట్టణ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. కంట్రోల్ బోర్డులు, ప్యానెల్స్ మార్చడం మున్సిపాలిటీనే చూసుకోవాల్సి వస్తోంది. 2027వరకు నిర్వహణ సంస్థతో అగ్రిమెంట్ ఉన్నప్పటికీ స్పందించడం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రతీ నెల బిల్లులు పంపుతున్నారు కానీ పనులు చేయడం లేదని, అందుకే కొన్ని నెలలుగా బిల్లులు నిలిపివేసినట్లు తెలిసింది.
భారం భరిస్తున్నాం
వీధి దీపాలు, విద్యుత్ బిల్లులు మున్సిపాలిటీ చూసుకుంటుంది. ఏటా రూ.7 లక్షల బిల్లులు చెల్లిస్తున్నాం. నిర్వహణ బాధ్యత ఈఈఎస్‌ఎల్ సంస్థ చూసుకోవాలి. వారు స్పందించడం లేదు. అనేకమార్లు కమిషనర్ ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదు. మళ్లీ భారమంతా మేమే భరిస్తున్నాం.
– స్వర్ణకుమార్, డీఈ