చేవెళ్ల: మున్సిపాలిటీకి పన్నుల వసూళ్లే కీలక ఆదాయ వనరు కావడంతో అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. చేవెళ్ల మున్సిపాలిటీ కొత్తగా ఏర్పాటు కావటంతో పన్నుల వసూళ్ల ప్రక్రియ ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతోంది. గతంలో పంచాయతీలుగా ఉన్న సమయంలోనే 40 శాతానికిపైగా వసూలైనట్టు అధికారులు చెబుతున్నారు. మున్సిపాలిటీలోకి మారిన తరువాత పన్నుల వసూళ్ల కోసం ఆన్‌లైన్ విధానంలో అమలు చేసేందుకు ప్రత్యేక యంత్రాలను ఉపయోగించేందుకు ఓ బ్యాంక్ ద్వారా అనుసంధానం అయ్యారు. ఇంకా పన్నులు వసూలు చేసే యంత్రాలు మున్సిపాలిటీకి రాకపోవడంతో పూర్తిస్థాయిలో వసూళ్లు చేయడం లేదు. ప్రస్తుతం పన్నులు చెల్లించే వారి నుంచి చెక్కుల రూపంలో తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. వీటిని ఆన్‌లైన్ యంత్రాలు వచ్చిన వెంటనే అప్‌డేట్ చేస్తామంటున్నారు. అప్పుడే పూర్తి వివరాలు తెలుస్తాయని పేర్కొంటున్నారు. వందశాతం వసూళ్లే లక్ష్యంగా ముందుకు వెళ్తామని మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్ చెప్పారు. రెండుమూడురోజుల్లో యంత్రాలు వచ్చిన వెంటనే ప్రక్రియ మరింత వేగవంతంగా సాగుతుందన్నారు.