కందుకూరు: ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో ఇద్దరు సోదరులను అరెస్ట్ చేసిన పోలీసులు, మంగళవారం వారిని రిమాండ్‌కు తరలించారు. సీఐ సీతారామ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండల పరిధిలోని సరస్వతిగూడకు చెందిన శమంత అలియాస్ శశికళకు గతంలో వివాహం కాగా భర్త చనిపోయాడు. దీంతో తన కుమార్తెను తీసుకుని హైదరాబాద్‌లోని అత్తవారి ఇంటి నుంచి పుట్టింటికి వచ్చేసింది. ఇదిలా ఉండగా శమంతకు ఇదే గ్రామానికి చెందిన మొలగాసి సుధాకర్‌తో పెళ్లికి ముందు నుంచే పరిచయం ఉంది. భర్త చనిపోవడంతో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో చనువుగా ఉంటున్నాడు. ఈ విషయం తెలిసిన ఆమె అన్న మాదరమోని శేఖర్(33), తమ్ముడు మాదరమోని వినయ్(27) గతంలో పలుమార్లు సుధాకర్‌ను, శమంతను మందలించారు. కొద్ది రోజుల క్రితం శమంత తన అవసరాల నిమిత్తం సుధాకర్ వద్ద కొంత డబ్బును అప్పుగా తీసుకుంది. ఈనెల 22న మధ్యాహ్నం సమయంలో తన డబ్బు ఇల్వాలంటూ సుధాకర్ శమంత ఇంటికి వెళ్లి, కత్తితో బెదిరించాడు. ఈ సమయంలో శమంతతో పాటు సోదరులు సుధాకర్‌తో గొడవపడ్డారు. దీంతో శమంత అదే రోజు కందుకూరు పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న సుధాకర్ తన తల్లి వసంతతో కలిసి బైక్‌పై అదే రోజు సాయంత్రం కందుకూరు పీఎస్‌కు వెళ్తుండగా.. శమంత సోదరులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సుధాకర్ చికిత్స పొందుతూ ఈ నెల 23న మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి నిందితులను పట్టుకుని, రిమాండ్‌కు తరలించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వివరాలు వెల్లడించిన సీఐ సీతారామ్
హత్య కేసులో అన్నదమ్ములకు రిమాండ్