
సహకారం సద్వినియోగం చేసుకోవాలి
ఇబ్రహీంపట్నం రూరల్: గ్రామీణ మహిళల ఆర్థిక ప్రగతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీలత అన్నా రు. ఉపాధిహామీ నిధులతో ఎల్మినేడులో నిర్మించిన తల్లికోళ్ల పెంపకం షెడ్డును బుధవారం ఆమె ప్రారంభించారు. ముందుగా ఆమె ఉపాధిహామీ పనులను కూలీలకు చేపట్టిన ప్రదేశానికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీలత మాట్లాడుతూ.. జిల్లాలో ప్రతీ మండలానికి ఒక తల్లికోళ్ల పెంపకం షెడ్డులు మంజూరు చేశామని.. మహిళా సంఘం సభ్యులకు రూ.2.99లక్షల ఉపాధి హామీ నిధులతో షెడ్డు నిర్మిస్తున్నట్లు చెప్పారు. పాడి పరిశ్రమ నిమిత్తం రుణాలు తీసుకున్న వారికి రూ.83వేలు ఇస్తారని.. ఈ నెల చివర వరకు నిర్మించాలన్నారు. ఐదు ఎకరాలలోపు ఉన్న రైతులు మామిడి, జామ, నిమ్మ, డ్రాగన్‌ఫ్రూట్, మునగ తోటలు పెంచుకునేందుకు సహకారం అందిస్తామన్నారు. చెరువులు, కుంట కట్టలు బలోపేతం చేసి నీటి నిల్వ సామర్థ్యం పెంచడానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం క్లస్టర్ ఏపీడీ నరేందర్‌రెడ్డి, ఎంపీడీఓ వెంకటమ్మ, ఏపీఓ తిరుపతాచారి, ఈసీ రవికుమార్, ఏపీఎం రవీందర్, సీసీ నరసింహ, పంచాయతీ కార్యదర్శి రవీందర్, సాంకేతిక సహాయకులు సునంద, ఫీల్డ్ అసిస్టెంట్ దాసు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీలత