కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ దేవత ఆలయ హుండీ ఆదాయాన్ని దేవాదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ శేఖర్ ఆధ్వర్యంలో గురువారం ఆలయ ప్రాంగణంలో లెక్కించారు. మొత్తం 60 రోజులకు గాను రూ.12,01,567 ఆదాయం వచ్చింది. ఈ మొత్తాన్ని కడ్తాల్ కెనరా బ్యాంక్‌లో డిపాజిట్ చేయనున్నట్లు ఈవో స్నేహలత తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్టీ శిరోలీ, సిబ్బంది, అన్నపూర్ణ సేవా ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
మాసబ్ చెరువును
పరిరక్షిస్తాం
తుర్కయంజాల్: మాసబ్ చెరువును పరిరక్షిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. తుర్కయంజాల్‌లోని మాసబ్ చెరువు శిఖం సర్వే నంబర్ 137లోని భూమిలో రోడ్డు నిర్మాణానికి డంప్ చేసిన మట్టిని తొలగిస్తున్న పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మట్టి డంప్ చేసిన వారిపై కేసులు నమోదు చేశారా లేదా అని ఆరా తీశారు. మట్టి తొలగింపు పనులను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
మున్సిపాలిటీలో కలపండి
మొయినాబాద్: మండలంలోని నాగిరెడ్డిగూడ పంచాయతీని కొత్తగా ఏర్పడిన మొయినాబాద్ మున్సిపాలిటీలో విలీనం చేయాలని నాగిరెడ్డిగూడ గ్రామస్తులు జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు, కలెక్టర్ నారాయణరెడ్డికి విన్నవించారు. ఈ మేరకు గురువారం వేర్వేరుగా వారిని కలిసి వినతిప్రతాలు అందజేశారు. నాగిరెడ్డిగూడ గ్రామం గతంలో రాజేంద్రనగర్ సమితిలో ఉండేదని.. 1982 వరకు హుడా పరిధిలోనే ఉన్న తమ గ్రామ రెవెన్యూలోని భూముల రిజిస్ట్రేషన్ ధరణి రాకముందు హైదరాబాద్‌లో జరిగేవని వివరించారు. భౌగోళికంగా మొయినాబాద్ మున్సిపాలిటీ మధ్యలో నాగిరెడ్డిగూడ గ్రామ రెవెన్యూ భూములు ఉన్నాయన్నారు. హిమాయత్‌సాగర్ జలాశయానికి ఆనుకుని ఉన్న తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో కలిపితేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు కీసరి సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్ సద్గుణాచారి, మాజీ ఎంపీటీసీ అర్జున్, నాయకులు మాణిక్యం, సుధాకర్, వినోద్‌కుమార్, మహేందర్, యాదగిరి, మల్లేష్, అశోక్, రవీందర్‌గౌడ్, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీశైలం, ముత్యాలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
నేడు ‘డయల్ యువర్ డీఎం’
మహేశ్వరం: స్థానిక ఆర్టీసీ డిపోలో శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ లక్ష్మీసుధ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రయాణికులు 91542 98784 నంబర్‌కు ఫోన్ చేసి సలహాలు, సూచనలు అందించాలని, సమస్యలను తెలియజేయాలని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఎల్‌ఆర్‌ఎస్‌కు స్పందన అంతంతే..
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ పరిధిలో 2020లో ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నవారు 1,07,865 మంది కాగా.. వీరిలో ఇప్పటి వరకు కేవలం 5,505 మంది మాత్రమే ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం రాయితీని వినియోగించుకున్నారు. తద్వారా జీహెచ్‌ఎంసీకి రూ.69.62 కోట్లు సమకూరాయి. మొత్తం దరఖాస్తుదారుల్లో 58,523 మందికి ఆటోమేటిక్‌గా ఫీజు లెటర్స్ జారీ కాగా, వారిలో కేవలం 5,505 మంది మాత్రమే 25 శాతం ఫీజు రాయితీని వినియోగించుకున్నారు. వీరిలో 40 మందికి ప్రొసీడింగ్స్ జారీ అయినట్లు సమాచారం. మరో నాలుగు రోజుల్లో గడువు ముగుస్తుందని, మిగతా వారు కూడా ఈ సదుపా యాన్ని వినియోగించుకోవాల్సిందిగా జీహెచ్‌ఎంసీ సూచించింది.