
లీజు ముగిసినా క్వారీని వదలట్లేదు
సాక్షి, సిటీబ్యూరో: మేడ్చల్ జిల్లా గాజులరామారంలోని క్వారీపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. గ్రామంలో క్వారీ లీజు గడువు ముగిసినా యజమానులు అక్కడ నుంచి ఖాళీ చేయకుండా స్థలం కబ్జాకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఇటీవల హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఆరా తీసేందుకు వెళ్లిన రంగనాథ్ సమీపంలోని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ భూముల కబ్జాలను పరిశీలించారు. ఆ ప్రాంతంలో దాదాపు 400ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని, వాటిని కబ్జా కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆ ప్రాంతంలో 78 ఎకరాలను లీజుకు తీసుకున్న వారితో హైడ్రా కమిషనర్ వచ్చే వారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. గాజులరామారం నుంచి శేరిలింగంపల్లి వెళ్లిన ఆయన నల్లగండ్ల చెరువు నాలాను పరిశీలించారు. నాలా విస్తీర్ణం తగ్గకుండా చూడాలని, అక్కడ పోసిన మట్టిని తొలగించాలని వెర్టెక్స్ నిర్మాణ సంస్థను ఆదేశించారు. ఈ సందర్భంగా నాలాతో పాటు బఫర్ జోన్‌కూ ఆటంకం లేకుండా నిర్మాణాలు చేయపడతామని నిర్మాణ సంస్థ హామీ ఇచ్చింది. గోపన్నపల్లి, పుప్పాలగూడలకు వెళ్లిన కమిషనర్ మేల్లకుంట, మామాసానికుంటలను పరిశీలించారు. సర్వే నంబర్ల ప్రకారం చెరువుల హద్దులపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన క్షేత్రస్థాయిలో సమీక్షించారు.
హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదులు
గాజులరామారంలో పర్యటించిన రంగనాథ్
మరో మూడు ప్రాంతాలకు వెళ్లి పరిశీలనలు