
విద్యారంగాన్ని కాపాడుకుందాం
● యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగయ్య
షాద్‌నగర్: విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగయ్య అన్నారు. పట్టణంలోని ఎంఆర్సీ భవనంలో సోమవారం సంఘం జిల్లా కార్యదర్శి నర్సింలు అధ్యక్షతన ‘పాఠశాల విద్య–ప్రభుత్వ విధానం, మనకర్తవ్యం’అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జంగయ్య మాట్లాడుతూ.. కేంద్రం అమలు చేయాలనుకుంటున్న జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ–2020) పేద వర్గాలకు నాణ్యమై విద్యను దూరం చేసేవిధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యను కేంద్రీకరించేలా, కార్పొరేటీకరణకు అనుకూలంగా ఉందన్నారు. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విద్యా విధానాలు లోప భూయిష్టంగా ఉన్నాయని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ప్రతి మండలంలో 4 నుంచి 5 పాఠశాలలను ఎంపిక చేసుకొని ప్రీ ప్రైమరీ, ప్రైమరీ పాఠశాలలు ఒకే దగ్గర ఉండేలా, 6 నుంచి 12వ తరగతి వరకు ఒక క్యాంపస్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు సత్యం, రామకృష్ణ, వినీత్, శేఖర్‌గౌడ్, బాలయ్య, జేవీవీ నాయకులు వెంకటరమణ, కుర్మయ్య, సీఐటీయూ నాయకుడు రాజు, టీజీఎస్, ఎస్‌ఎఫ్‌ఐ, డీటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు.