
నేడు భూభారతి చట్టంపై అవగాహన సదస్సు
మహేశ్వరం: భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టంపై సోమవారం మండల కేంద్రంలోని కాకి ఈశ్వర్ ఫంక్షన్ హాలులో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్టు మహేశ్వరం తహసీల్దార్ సైదులు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సదస్సుకు కలెక్టర్ నారాయణరెడ్డి, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి హాజరుకానున్నట్టు చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టం గురించి రైతులకు అవగాహన కల్పించడంతో పాటు కొత్త చట్టంలోని ప్రయోజనాలను వివరించి, సందేహాలను నివృత్తి చేయనున్నట్టు తెలిపారు. ఉదయం 10 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని, రైతులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
ఇబ్రహీంపట్నంలో..
ఇబ్రహీంపట్నం: భూ భారతిపై సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఇబ్రహీంపట్నంలోని శాస్త్రా గార్డెన్‌లో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ప్రభుత్వాధికారులు పాల్గొని అవగాహన కల్పిస్తారన్నారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణులు, ప్రజాప్రతినిధు లు, రైతులు, ప్రజలు పాల్గొనాలని కోరారు.
చిలుకూరు ఫారెస్ట్ ట్రెక్ పార్కులో నేచర్ క్యాంప్
మొయినాబాద్: మున్సిపల్ పరిధిలోని చిలుకూరు ఫారెస్ట్ ట్రెక్ పార్కులో నేచర్ క్యాంప్ నిర్వహించారు. తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డెక్కన్ వడ్స్ అండ్ ట్రయల్స్ పేరిట శనివారం సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు చేపట్టిన నేచర్ క్యాంపులో మైక్రాన్ సంస్థ ఐటీ ఉద్యోగులు 52 మంది పాల్గొన్నారు. అడవిలో టెంట్ ఎలా వేయాలి, క్యాంప్ ఫైర్, ట్రెక్కింగ్, నేచర్ ట్రయల్, టెంట్‌లో విడిది, పక్షుల వీక్షణ, చెట్ల గురించి, సహజ రాతి నిర్మాణాల గురించి వారికి నేచురలిస్ట్‌లు అఖిల్, అపరంజిని, సుమన్ వివరించారు. చెట్లు, వాటి ఉపయోగాల గురించి తెలియజేశారు. ఐటీ ఉద్యోగులు నేచర్ క్యాంపులో ఆసక్తికరంగా పాల్గొన్నారు.
క్రికెట్ ఆడుతూ కుప్పకూలి..
గుండెపోటుతో యువకుడి మృతి
కీసర: మైదానంలో క్రికెట్ ఆడుతూ ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఆదివారం రాంపల్లిదాయరలో చోటుచేసుకుంది. కీసర సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన ఎం.ప్రణీత్ (32) కెనరా బ్యాంకులో పని చేస్తున్నాడు. ఆదివారం సెలవు రోజు కావడంతో స్నేహితులతో కలిసి రాంపల్లిదాయర సమీపంలోని మైదానంలో క్రికెట్ ఆడుతుండగా అకస్మాత్తుగా కిందపడిపోయాడు. వెంటనే స్నేహితులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ప్రణీత్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడటానికి వచ్చి గుండెపోటుతో మృతి చెందడంతో ప్రణీత్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కీసర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.