
విద్యావ్యస్థను గాలికొదిలేసిన ప్రభుత్వం
● ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజనీకాంత్
షాద్‌నగర్: ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా గాలికొదిలేసిందని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజనీకాంత్ విమర్శించారు. పట్టణంలోని ఠాగూర్ ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో గురువారం ఎస్‌ఎఫ్ ఐ జిల్లా 26వ మహాసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ. ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజుల రూపంలో కోట్ల రూపాయలు దండుకుంటున్నా అడిగే నాథుడే కరువయ్యాడని వాపోయారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన విద్యా విధానంతో విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. అనంతరం సంఘం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ప్రణయ్, ఉపాధ్యక్షులుగా చరణ్, శ్రీకాంత్, శివ, తరంగ్, కార్యదర్శిగా శంకర్, సహాయ కార్యదర్శిగా అరుణ్, శ్రీకాంత్, స్టాలిన్, సభ్యులుగా వంశీ, శ్రీనివాస్, కుమార్, తనీష్, ప్రణవ్, శివ, తరుణ్, రాము, చరణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.