
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
పోచారం: ఇంటర్మీడియట్‌లో ఫెయిలైనందుకు మనస్తాపం చెందిన విద్యార్థి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం..జగిత్యాలలోని హనుమాన్‌వాడకు చెందిన భూసి జశ్వంత్ (17) అన్నోజిగూడలోని నారాయణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇంటర్ ప్రథమ సంవత్సం 90 శాతం మార్కులతో పాసైన జశ్వంత్..ద్వితీయ సంవత్సరంలో మాత్రం మూడు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాడు. దీంతో మానసిక వేదనకు గురయ్యాడు. ఇటీవల నగరంలో ఉంటున్న తన మామ ఇంటికి వెళ్లి 90 శాతం మార్కులతో ఇంటర్ పాసయ్యానని చెప్పాడు. కానీ, తల్లిదండ్రులతో ఫెయిలయ్యానని ఫోన్ చేసి చెప్పాడు. ఈ క్రమంలో జశ్వంత్ బుధవారం సాయంత్రం ఉప్పల్‌లో గడ్డి మందు బాటిల్ కొనుక్కుని కాలేజ్‌కు వచ్చాడు. ఆ రోజు రాత్రి కావడంతో ఇంటికి వెళ్లడం కుదరలేదు. మరుసటి రోజు గురువారం ఉదయం 4 గంటల సమయంలో గడ్డి మందు తాగాడు. విషయం తెలుసుకున్న కళాశాల నిర్వాహకులు సమీపంలోని హాస్పిటల్‌లో ప్రథమ చికిత్స చేయించి, మెరుగైన వైద్యం కోసం జశ్వంత్‌ను సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం జశ్వంత్ మృతి చెందాడు. మృతుని తండ్రి వెంకటేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యపై ఎలాంటి అనుమానాలు లేవని, ఈ విషయంలో కళాశాల యాజమాన్యంతో పాటు సిబ్బందికి ఎలాంటి సంబంధం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, కళాశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ తనను హేళనగా చూడడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు జశ్వంత్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడని స్నేహితులు చెబుతున్నారు.