చలికాలంలో వణుకు సహజం. కానీ, ఆ వణుకు ప్రాణంపోయేలా, క్షణాల్లో మనిషిని సైతం గడ్డకట్టించేదిగా ఉంటే!. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం.. తన దేశ పౌరులను ఉద్దేశించి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. శీతాకాలపు తుపాను వేగంగా వస్తున్నందున క్రిస్మస్‌కు కుటుంబ సభ్యులను, స్నేహితులను సందర్శించడానికి వెళ్లాలనుకునే అమెరికన్లు వెంటనే బయలుదేరాలని ఆయన హెచ్చరించారు. మంచు తుపాను బలం పుంజుకోవడంతో.. అత్యంత అరుదైన పరిణామం ‘బాంబ్ సైక్లోన్’గా బలపడొచ్చని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది.
అమెరికా మంచు తుపాన్‌తో వణికిపోతోంది. -39(మైనస్) డిగ్రీల సెల్సియస్‌కు మెర్క్యూరీ మీటర్లు పడిపోతున్నాయి. అర్కిటిక్ బ్లాస్ట్.. విపరీతమైన చలిని, హిమపాతాన్ని, చల్లని గాలులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు అక్కడి ప్రజలు. ఇప్పటిదాకా ఐదుగురు మృత్యువాత చెందారు. గత నలభై ఏళ్లలో ఎన్నడూ ఇంత ఘోరమైన పరిస్థతి ఎదుర్కొలేదని వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పటికే వందల సంఖ్యలో విమానాలు రద్దు అయ్యాయి. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. రోడ్డు, రైల్వే మార్గాలు సైతం మంచు ప్రభావానికి గురికాగా.. క్రిస్మస్‌పై ఈ ఎఫెక్ట్ పడేలా కనిపిస్తోంది.
ఇది ప్రమాదకరమైనది. మీరు చిన్నప్పుడు చూసిన మంచులాంటిది కాదు. ప్రాణాలకు ముప్పు కలిగించేది. చాలా తీవ్రమైన వాతావరణం.. ఓక్లహోమా నుంచి వ్యోమింగ్, మైనే వరకు కొనసాగనుంది. కాబట్టి నేను ప్రతి ఒక్కరూ దయచేసి స్థానిక హెచ్చరికలను పట్టించుకోవాలని ఒవల్ కార్యాలయం నుంచి జాతిని ఉద్దేశించి బైడెన్ కోరారు.
మధ్య అమెరికా నుంచి తూర్పు వైపు వీచే ఈ శీతలగాలుల ప్రభావంతో.. 135 మిలియన్ల(సుమారు పదమూడు కోట్ల మంది) జనాభాపై ప్రభావం పడనుందని తెలుస్తోంది. గురువారం ఒక్కరోజే.. 60 మిలియన్ల మందిపై ఇది ప్రభావం చూపెట్టింది.
బాంబ్ సైక్లోన్ అంటే..
బాంబ్ సైక్లోన్ అనేది మధ్య-అక్షాంశ తుపాను. దీనిలో కేంద్ర పీడనం గంటకు ఒక మిల్లీబార్ వద్ద కనీసం 24 గంటల పాటు వేగంగా పడిపోతుంటుంది. అయితే, తుపాను ఎక్కడ ఏర్పడుతుందనే అనే దాని ఆధారంగా మిల్లీబార్ రీడింగులు మారే అవకాశం ఉంటుంది. వాయు పీడనం అనేది వాతావరణం యొక్క బరువు ద్వారా ప్రయోగించే శక్తిని కొలవడం. ఈ పీడనం ఎంత తక్కువగా ఉంటే తుపాను అంత బలంగా ఉంటుందన్న మాట.
అమెరికా జాతీయ వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. ప్రస్తుత పరిస్థితి కొనసాగితే.. ఉష్ణోగ్రతలు ఇప్పుడున్న దానికంటే 11 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవచ్చట. అలాగే గాలి పీడనం 1003 మిల్లీబార్‌ల నుంచి 968 మిల్లీబార్‌లకు పడిపోవచ్చని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ .
బాంబు తుపాన్ ఎలా ఏర్పడుతుందంటే.. వివిధరకాల వాయు ద్రవ్యరాశి (చల్లని, పొడి) గాల్లో కలిసినప్పుడు. వెచ్చని గాలి పెరిగేకొద్దీ, అది గాలి ఒత్తిడిని తగ్గించే క్లౌడ్ వ్యవస్థను సృష్టిస్తుంది. అల్పపీడన ప్రాంతం చుట్టూ అపసవ్య దిశలో ప్రసరించే తుఫానుగా ఏర్పడుతుంది.
జనావాసాలపై బాంబ్ సైక్లోన్ ప్రభావం ఊహించని రీతిలో ఉంటుంది. మనుషుల ప్రాణాలు తీయడంతో పాటు ఆస్తి నష్టం కూడా భారీగానే ఉంటుంది. గట్టిగా గాలి పీల్చినా.. మాట్లాడినా సరే ఆ చలికి తెమడ పట్టేసి.. ప్రాణాలకు తీసుకొస్తుంది.
1979 నుంచి 2019 మధ్య.. ఉత్తర అమెరికాలో ఏడు శాతం మంచు తుపానులు బాంబ్ సైక్లోన్‌లుగా మారాయి. 1980లో బాంబ్ సైక్లోన్ అనే పదాన్ని ఉపయోగించారు. బాంబ్ సైక్లోన్ స్థితి చలికాలంలోనే కాదు.. అరుదుగా సమ్మర్‌లోనూ నెలకొంటుంది. వీటి ప్రభావంతో ఇప్పటిదాకా వందల నుంచి వేల మంది మరణించారు!.
బాంబు సైక్లోన్ తుపాను అనేది.. చల్లని గాలుల తీవ్రతను బట్టి ఉంటుంది. దీంతో అమెరికాలో ఇప్పుడు నెలకొన్న పరిస్థితి మరింత దిగజారవచ్చు. టెంపరేచర్లు.. సున్నా కంటే చాలా తక్కువ ప్రమాదకరమైన కనిష్ట స్థాయికి పడిపోవచ్చు. అంటే.. ఏదైనా సరే నిమిషాల్లో గడ్డకట్టుకుపోతుంది. క్రిస్మస్ తర్వాత నుంచి నెమ్మదిగా మొదలై.. కొత్త సంవత్సరం మొదటిరోజు నాటికి ఈ పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
భారీగా కురుస్తోన్న మంచు(Snow), చలిగాలులకు.. స్థానిక ఉష్ణోగ్రతలు ఘోరంగా పడిపోయాయి. క్రిస్మస్ దగ్గర పడుతున్న వేళ.. ప్రయాణాలకు ఈ వాతావరణం అవరోధంగా మారింది. గురువారం ఒక్కరోజే వేలాది విమానాలు రద్దయినట్లు సమాచారం.
కెంచుకీ, జార్జియా, నార్త్ కరోలినా, ఒక్లాహోమాలు అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. మేరీల్యాండ్, మిస్సోరీలు.. అత్యవసర పరిస్థితులకు సిద్దంగా ఉనన్నాయి. మిన్నెసొటాలో జంట నగరాలు స్నో ఎమర్జెన్సీలను ప్రకటించుకున్నాయి. ఈశాన్య వాతావరణంతో పోలిస్తే.. బాంబ్ సైక్లోన్ ప్రభావం మరీ ఘోరంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment