ఆలమూరు: వ్యవసాయంపై మక్కువ పెంచుకున్న ఆ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తనకున్న రెండున్నర ఎకరాల భూమిలో పూలు, కూరగాయలు సాగు చేస్తున్నాడు. ఓ అరెకరం పొలంలో మాత్రం వినూత్నంగా ఎర్రబెండలు సాగుచేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నాడు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంకకు చెందిన భీమాల రాఘవేంద్ర.. సోషల్ మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా జిల్లాలో మరెక్కడా లేని ఎర్రబెండ సాగుకు శ్రీకారం చుట్టారు.
ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే శీతాకాలంలోనే దీనిని సాగుచేయాలన్న ఉద్యాన శాస్త్రవేత్తలు ఇచి్చన సలహాతో గత నవంబర్ చివరి వారంలో సాగు చేపట్టాడు. ముదురు ఆకుపచ్చ రంగు స్థానంలో ఎండు మిరప రంగును పోలి ఉన్న ఎర్ర బెండకాయలను ఆయన పండిస్తున్నాడు. విత్తనాలను వారణాశిలోని నేషనల్ సీడ్ కార్పొరేషన్ నుంచి ఆన్‌లైన్‌లో తెప్పించి.. అరెకరంలో ప్రయోగాత్మకంగా సాగు చేపట్టాడు. సాధారణ రకం బెండ 60 రోజుల్లో కోతకు వస్తుంది. కానీ ఎర్రబెండ మాత్రం 40 రోజుల్లోనే దిగుబడినిస్తోంది. అది కూడా సాధారణ పంట కంటే 20 శాతం అధికంగా. పచ్చ బెండ మాదిరిగా ఈ ఎర్ర బెండలో జిగురు లేదు. ఆకృతి కూడా ఆకర్షణీయంగా ఉండటంతో శాకాహారులు అమితంగా ఇష్టపడుతున్నారు. అయితే కూర వండాక ఎర్రబెండ ఆకుపచ్చ రంగుకు మారడం విశేషం.
పుష్కలంగా పోషకాలు
- విటమిన్ సీ, ఏ, బీతో పాటు ఫోలాసిన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి.
- కాల్షియం, ఫైబర్ సమృద్ధిగా ఉన్నాయి. కేలరీలు తక్కువ మోతాదులో ఉంటాయి.
- కంటి చూపును మెరుగుపరచి, చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
- ఎర్ర రక్తకణాల సంఖ్యను, రోగ నిరోధక శక్తిని వృద్ధి చేస్తాయి.
- ఎర్రబెండలో ఉండే ఫోలేట్ గర్భిణులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
- మధుమేహాన్ని అదుపులో ఉంచడం, బరువు తగ్గేందుకు సాయపడుతుంది.
ప్రత్యేకతను చాటుకోవాలనే..
సహజ పంటలకు భిన్నంగా నూతన వంగడాల్ని ఈ ప్రాంత ఉద్యాన రైతులకు పరిచయం చేసి, తద్వారా వ్యవసాయ రంగంలో ప్రత్యేకతను చాటుకోవాలనే ఉద్దేశంతోనే ఎర్రబెండ సాగు చేశాను. ఆశించిన దానికంటే దిగుబడి ఎక్కువగా వచ్చింది. మార్కెట్‌లో గిట్టుబాటు ధర కూడా లభిస్తోంది. ఉద్యాన శాఖ రాయితీలిస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
– బి.రాఘవేంద్ర, రైతు.
Comments
Please login to add a commentAdd a comment