రాజధాని అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడడం లేదు?. దీనివల్ల ఆయనను నమ్ముకుని ఇంతకాలం రోడ్డుమీద తిరిగిన రైతుల్లో, రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో.. వారందరికీ ఏం సంకేతం ఇచ్చినట్లు?. కీలక సమయాల్లో ఆయన హాండిస్తారన్న అభిప్రాయం కలిగే అవకాశం లేదా?.
అమరావతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంటూ భ్రమలు కల్పించే క్రమంలో చంద్రబాబు, ఆయనకు మద్దతు ఇచ్చే ఈనాడు, తదితర టీడీపీ మీడియా సంస్థలు ప్రజలను మోసం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేశాయి. అయినా ఎప్పుడో అప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయన్న చందంగా సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులు వారిపాలిట అశనిపాతంగా మారాయి. ఒక విధంగా చెప్పాలంటే వారి నోట మాట రాకుండా చేశాయి. అయినా ఈనాడు, జ్యోతి వంటి మీడియాలు యథాప్రకారం ఎంతో కొంత వక్రీకరించి, మరో రెండు అంశాలపై స్టే ఇవ్వలేదు కదా అని సంతృప్తి చెందుతూ ఆత్మవంచన చేసుకుంటున్నాయి.
అదే సమయంలో గౌరవ న్యాయమూర్తులు చేసిన కీలక వ్యాఖ్యలు ప్రజలకు చేరకూడదని అవి ఆశిస్తున్నాయి. చంద్రబాబు కూడా అదే తరహాలో ఆలోచిస్తున్నారు. సుప్రీంకోర్టు రాజధాని నిర్మాణ వ్యవధి తదితర అంశాలపై హైకోర్టును తీవ్రంగా తప్పుపట్టడంతో ఇంతవరకు హైకోర్టు తీర్పును అంతిమ తీర్పు అన్నట్లుగా ప్రచారం చేసిన వీరంతా కొత్త ప్లాన్‌కు తెరలేపుతున్నారని అనిపిస్తున్నది. చంద్రబాబు వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రస్తావించి ఆయనను ఇరుకునపెట్టారు. సహజంగానే ఈ పరిణామం వైఎస్సార్‌సీపీకి సంతోషం కలిగించే విషయం కాగా, టీడీపీకి తీరని దు:ఖాన్ని మిగుల్చుతుంది.
తమ రాజకీయ భవిష్యత్తు అంతా అమరావతిలోనే ఉందని టీడీపీ వారు అనుకున్నారు. ఎలాగోలా మూడు రాజధానుల ప్రతిపాదనను చెడగొడితే తమకు కలిసి వస్తుందని వారు ఆశించారు. కానీ వారి ఆశలపై సుప్రీంకోర్టు నీళ్లు చల్లినట్లయింది. ఇంతకీ చంద్రబాబు ఎందుకు మౌనం దాల్చారు?. ఆ పార్టీ వారు తమకు అనుకూలంగా కోర్టు ఆదేశాలు ఉంటే రెచ్చిపోయి ఉండేవారు కదా?. ఇందుకు కొన్ని కారణాలు కనిపిస్తాయి. సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులపై వ్యతిరేకంగా మాట్లాడలేని పరిస్థితిలో కామెంట్ చేయకుండా ఉండటమే బెటర్ అని అనుకుని ఉండవచ్చు. అమరావతి వల్ల తమకు నష్టమే తప్ప రాజకీయ లాభం కలగడం లేదన్న అభిప్రాయానికి వచ్చి కూడా ఉండవచ్చు. కనీసం అమరావతిలో ఇన్నాళ్లు ఆందోళన చేసిన వారికి స్వాంతన కూర్చే విధంగా కూడా ఆయన మాట్లాడకపోవడం రాజకీయ అవకాశవాదానికి మరో ఉదాహరణ అవుతుంది. ఒక వేళ భవిష్యత్తులో సుప్రీంకోర్టులో ఏమైనా అనుకూలంగా నిర్ణయం వస్తే అప్పుడు స్పందించవచ్చులే అనుకున్నారేమో తెలియదు.
ఇప్పటికే అమరావతి వల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమలో టీడీపీ తీవ్రంగా నష్టపోతే చివరికి కృష్ణా, గుంటూరు జిల్లాలలో కూడా చుక్కెదురైంది. దీంతో, టీడీపీలోనే రెండు వాదనలు బయల్దేరాయన్న టాక్ వినిపిస్తోంది. ఒక వాదన ప్రకారం ఇప్పటికే అమరావతి వల్ల తీవ్రంగా నష్టపోయామని, దానిని సాధ్యమైనంత తగ్గించుకుంటే బెటర్ అని భావిస్తున్నారు. మరో వాదన చేసేవారు.. ఇంతకాలం అమరావతి ఆందోళనను స్పాన్సర్ చేసి , ఇప్పుడు ఆకస్మికంగా వదలివేస్తే వీరిని కూడా వెన్నుపోటు పొడిచినట్లు అవుతుందని అంటున్నారట. దీంతో, ఏం చేయాలో తోచక మల్లగుల్లాలు పడుతున్నారు.
మరోవైపు, సజ్జల తదితర వైఎస్సార్‌సీపీ నేతలు కచ్చితంగా మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని చెబుతున్నారు. టీడీపీ అడ్డుపడకపోతే, ఇప్పటికే ఆ ఆలోచన అమలై, మూడు ప్రాంతాల అభివృద్ధికి ఆస్కారం ఉండేదని సజ్జల అన్నారు. అమరావతి ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. మొత్తం మీద వికేంద్రీకరణ విషయంలో వైఎస్సార్‌సీపీ జోష్‌లో ఉంటే, టీడీపీ మాత్రం ఈ గండం నుంచి ఎలా బయటపడాలా అన్న ఆలోచనతో సతమతమవుతోంది. మరో అంశంపై కూడా సజ్జల క్లారిటీ ఇచ్చారు. వివేకా హత్య కేసుకు సంబంధించి వివేకా కుటుంబీకులు కొందరిని చంద్రబాబు మభ్య పెట్టి లొంగదీసుకున్నారని ఆరోపించారు. ఇంతకుముందు ఎప్పుడూ ఈ విషయాన్ని సజ్జల తెలుపలేదు. మొదటిసారిగా ఆ విషయాన్ని వెల్లడించడం ద్వారా జరుగుతున్న పరిణామాలపై నిర్మొహమాటపు వ్యాఖ్య చేశారని అనుకోవచ్చు.
రాజధాని అంశంలో సుప్రీంకోర్టు తీర్పుపై నోరు విప్పని చంద్రబాబు, వివేకా హత్య కేసు విచారణ తెలంగాణ సీబీఐ కోర్టుకు మార్చడంపై మాత్రం ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యానిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సీబీఐ కోర్టుకు కేసును బదిలీ చేయడాన్ని స్వాగతిస్తున్నామని కూడా ఆయన స్పష్టం చేశారు. తద్వారా ఆ కేసుతో తమకు ఎలాంటి సంబంధంలేదని, చంద్రబాబు ఎంత బురద చల్లాలని చూసినా అది సాధ్యం కాదని ఆయన చెప్పినట్లయింది.
ఏదైనా ఒక్క పాయింట్ దొరికినా, దొరక్కపోయినా, ఎదుటివారి వ్యక్తిత్వ హననం చేయడంలో చంద్రబాబు దిట్టగా పేరొందారు. ఆయనకు ఈనాడు, జ్యోతి వంటి మీడియా సంస్థలు తోడై నిప్పు లేకపోయినా, పొగ సృష్టించడం కోసం కుట్ర పన్నే పనిలో బిజీగా ఉంటున్నాయి. దానిని దృష్టిలో ఉంచుకునే వారిని కరోనా వైరస్‌తో ఆయన పోల్చారు. ఈ నేపధ్యంలో సజ్జల తమ వైఖరిని ఖరాఖండిగా చెప్పడం ద్వారా తలనొప్పిని తగ్గించుకున్నట్టు అయిందని చెప్పాలి.
హితేషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment