గ్రేటర్‌ సూపర్‌ స్టార్‌.. నగరంపై నటశేఖరుడి ముద్ర | Super star krishna Special Bond With Hyderabad | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌ సూపర్‌ స్టార్‌.. సొంత డబ్బుతో రోడ్డు.. అచ్చొచ్చిన ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌

Published Wed, Nov 16 2022 8:25 AM | Last Updated on Wed, Nov 16 2022 11:26 AM

Super star krishna Special Bond With Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొండలు..గుట్టలు..అడవి..జనసంచారం లేని నిర్మానుష్యమైన ప్రాంతం. ఆ ప్రాంతానికి నడవడం, సైకిల్‌పై వెళ్లడం తప్పితే కార్లు, ద్విచక్రవాహనాలు వెళ్లలేని పరిస్థితి. అలాంటి ప్రదేశాన్ని తన అభిరుచికి అనుగుణంగా కష్టపడి అద్భుతమైన స్టూడియోగా నిర్మించారు సూపర్‌ స్టార్‌ కృష్ణ. సినీ పరిశ్రమ నగరంలో స్థిరపడడంలో సూపర్‌స్టార్‌ కీలక పాత్ర పోషించారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి పద్మాలయా స్టూడియో నిర్మాణం. ముఖ్యంగా ఫిలింనగర్‌ అభివృద్ధికి మూలం సూపర్‌స్టారే.. 

తెలుగు చలనచిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కు 1981లో తరలిరాగా సినిమా షూటింగ్‌లకు అప్పట్లో అన్నపూర్ణ స్టూడియో మాత్రమే అందుబాటులో ఉండేది. పెద్ద ఎత్తున సినిమా షూటింగ్‌లు జరుగుతున్న హైదరాబాద్‌లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ పూర్తిగా ఇక్కడే స్థిరపడాలంటే మరో స్టూడియో అవసరాన్ని 50 సంవత్సరాల క్రితమే కృష్ణ గుర్తించారు. తెలుగు సినిమాల షూటింగ్‌లు మళ్లీ మద్రాసుకు వెళ్లకుండా హైదరాబాద్‌లోనే స్థిరపడాలన్న దృఢసంకల్పంతో ఇక్కడ స్టూడియో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పడు ఉన్న జూబ్లీహిల్స్, ఫిలింనగర్‌ లాంటి కాలనీలు లేని ఆ కాలంలో హైదరాబాద్‌కు దూరంగా..విసిరేసినట్టుగా ఉన్న ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని పద్మాలయ స్టూడియో నిర్మాణం కోసం 1983లో తొమ్మిదిన్నర ఎకరాలు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన కృష్ణ.. వెనక్కి తిరిగి చూసుకోకుండా రెండేళ్ల వ్యవధిలోనే నాలుగు ఫ్లోర్లు నిర్మించి ఇక్కడే కోర్టు హాల్, పోలీసు స్టేషన్, దేవాలయం, మసీదు, చర్చి తదితర సెట్టింగ్‌లను నిర్మించారు. ఆ తర్వాత మొత్తం చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లో స్థిరపడగా పద్మాలయ స్టూడియోలో రేయింబవళ్లు ప్రతి రో జూ నాలుగైదు షూటింగ్‌లు జరుగుతూ కళకళలాడింది.   
 

కలల స్టూడియోగా... 
ఈ పద్మాలయ స్టూడియోను కృష్ణ తన కలల సౌధంగా తీర్చిదిద్దుకుని అపురూపంగా చూసుకునే వారు. అమితాబ్‌ బచ్చన్, ధర్మేంద్ర, జితేంద్ర, రాజేష్‌ ఖన్నా వంటి నాటి బాలీవుడ్‌ హీరోల సినిమాలు కూడా ఈ స్టూడియోలో చిత్రీకరణ జరుపుకొన్నాయి. రజనీకాంత్, కమలహాసన్, మమ్ముట్టి, మోహన్‌లాల్‌ లాంటి దక్షిణాది అగ్రహీరోల సినిమా షూటింగ్‌లు కూడా ఇదే స్టూడియోలో జరిగాయి. ముంబయి, మద్రాసు, కేరళ, బెంగుళూరు తదితర ప్రాంతాల నుంచి షూటింగ్‌ల కోసం నటీనటులు, సాంకేతిక నిపుణులు పద్మాలయా స్టూడియోకు క్యూ కట్టడంతో ఈ ప్రాంతం పూర్తిగా అభివృద్ధికి నోచుకుంది. నాటి రాళ్లు, రప్పులు, రత్నాలుగా మారి ఈ ప్రాంతానికి ఎనలేని శోభను చేకూరింది. కృష్ణ తన షూటింగుల్ని ఫిలింనగర్‌లోని తన ఇంట్లో కూడా తీసేవారు. చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కు పూర్తిగా తరలిరావడానికి ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో పాటు కృష్ణ చేసిన కృషిని తెలుగు చిత్ర పరిశ్రమ ఎన్నటికీ  మరిచిపోలేదు. కేవలం కృష్ణ కృషి వల్లే ఇప్పడు ఉన్న ఫిలింనగర్‌ ప్రాంతమంతా కళకళలాడుతోందని చెప్పొచ్చు.   

సొంత డబ్బుతో రోడ్లు
ఇప్పుడు ఉన్న ఫిలింనగర్‌ రోడ్‌ నెం.1 ప్రధాన రహదారి నుంచి పద్మాలయ స్టూడియో వరకు తన సొంత డబ్బులతో కృష్ణ ఆ కాలంలో కంకర రోడ్డు వేయించి రాకపోకలను సులువు చేశారు. అదే సమయంలో ఫిలింనగర్‌లోనే సొసైటీ నుంచి ప్లాట్‌ కొనుగోలు చేసి ఇల్లు కట్టుకున్నారు. పూర్తిగా తన మకాంను హైదరాబాద్‌కు మార్చడంతో ఆయన సినిమా షూటింగ్‌లన్నీ పద్మాలయ స్టూడియోలో జరుగుతూ తెలుగు చిత్రపరిశ్రమ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లింది. అప్పట్లో పద్మాలయ స్టూడియో నిర్మించకపోతే మళ్లీ షూటింగ్‌లకు తెలుగు పరిశ్రమ మద్రాసుకు వెళ్లేదని పలువురు సినీ పెద్దలు కృష్ణ నిర్ణయాన్ని స్వాగతించారు. పద్మాలయా స్టూడియో నిర్మాణం తర్వాతనే పక్కనే రామానాయుడు స్టూడియో కూడా నిర్మాణం జరుపుకుంది. అనంతరం ఈ ప్రాంతంలో వందల సంఖ్యలో నిర్మాణాలు జరిగి అనేక సౌకర్యాలు సమకూరాయి. అనతికాలంలో వృద్ధి చెందింది. 

అచ్చొచ్చిన ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌.. విజయదుందుభి మోగించిన సినిమాలెన్నో... 
ముషీరాబాద్‌: సినీ వినోద కేంద్రం ఆర్‌టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సినిమా థియేటర్లలో సూపర్‌ స్టార్‌ కృష్ణ సినిమా విడుదలైందంటే చాలు అభిమానులకు పండగే. ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్, దాని చుట్టు పక్కల గల సుమారు 15 థియేటర్లలో ఎప్పుడు ఏదో ఒక థియేటర్‌లో కృష్ణ సినిమా ఆడాల్సిందే. ఎక్కువగా సుదర్శన్‌ 35 ఎంఎం, 70 ఎంఎం, సంగం థియేటర్లలో కృష్ణ సినిమాలు విడుదలయ్యేవి. మొదటి రోజు సినిమా, ప్రివ్యూలు వీక్షించేందుకు కృష్ణ అనేక సార్లు క్రాస్‌రోడ్స్‌కు వచ్చి సినిమా వీక్షించే వారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ప్రజారాజ్యం, ఈనాడు సినిమాలు సంధ్యా థియేటర్‌లో వంద రోజులు ఆడి రికార్డులు సృష్టించాయి. పాడి పంటలు బసంత్‌ టాకీస్‌లో వంద రోజులు నడిచింది. ఇక సుదర్శన్‌ 70ఎంఎంలో అగ్నిపర్వతం 175 రోజులు ఆడగా..అల్లూరి సీతారామరాజు సంగం థియేటర్‌లో విడుదలై సంచలనం సృష్టించింది. మొట్టమొదటిసారిగా కోటి రూపాయల బడ్జెట్‌తో సినిమా స్కోప్‌లో డాల్బీ సౌండ్‌ సిస్టమ్‌లో విడుదలైన సింహాసనం దేవి థియేటర్‌లో విడుదలై శత దినోత్సవం జరుపుకొంది. దేవిలో ఆ సినిమా టికెట్లు నెల రోజుల పాటు అడ్వాన్స్‌ బుకింగ్‌ అయ్యాయంటే కృష్ణకు ఉన్న క్రేజ్‌ ఏ పాటితో ఇట్టే అర్థం అవుతుంది. ఇక కృష్ణ ఫ్యాన్స్‌ మిగిలిన వారికి భిన్నంగా ఎంతో ప్రత్యేకంగా ఉండేవారని పలువురు థియేటర్ల యజమానులు కొనియాడుతున్నారు.    


మహేష్‌బాబు సినిమాల్లోనే కాదు యాడ్స్‌లోనూ సూపర్‌ హీరోనే. కానీ కృష్ణ విషయానికి వస్తే... యాడ్‌ వరల్డ్‌తో ఆయనకు పరిచయమే లేదనుకుంటాం. అలాంటి కృష్ణ కూడా నగరానికి చెందిన రెండు సంస్థల యాడ్స్‌లో నటించారు. ‘మొదట ఆయన కూడా నాతో యాడ్‌ ఏమిటి? అన్నారు. అయితే నా కాన్సెప్ట్‌ విన్నాక కన్విన్స్‌ అయ్యారు. యాడ్‌ చిత్రీకరణ సందర్భంగా కొన్ని రోజులు ఆయనతో గడపడం నా జీవితంలో మరచిపోలేను. ఆయన సింప్లిసిటీ చూసి ఆశ్చర్యపోయా’ అని చెప్పారు యాడ్‌ ఫిల్మ్‌ రూపకర్త యమునా కిషోర్‌. తొలి యాడ్‌ని పూర్తిగా ఇంట్లోనే తీస్తామని చెప్పి ఆయన్ని ఒప్పించామన్నారు. షూటింగ్‌ సమయంలో ఇంట్లో స్వంత మనుషుల్లా తమ టీమ్‌ను ఆదరించారంటూ గుర్తు చేసుకున్నారు. అలా తనపై ఏర్పడిన మంచి అభిప్రాయంతో ఆ తర్వాత మరో యాడ్‌కు కూడా ఆయన్ను సులభంగా ఒప్పించగలిగానని చెప్పారు.  


లలితకళాతోరణంలో సన్మానం... 
‘1993లో ఒకసారి కృష్ణ, విజయనిర్మల దంపతులిద్దర్నీ కలిపి లలితకళాతోరణంలో సన్మానించే అవకాశం లభించింది. వీలున్నంత వరకూ సన్మానాలు, సభలు అంటే ఆయన దూరంగా ఉండేవారు పలు కార్యక్రమాలకు ఆహ్వానించినా సున్నితంగా కాదని చెప్పేవారు’ అంటూ గుర్తు చేసుకున్నారు నగరానికి చెందిన కిన్నెర ఆర్ట్స్‌ సంస్థకు చెందిన రఘురామ్‌. అయితే స్నేహానికి మాత్రం ఆయన దూరంగా ఎప్పుడూ లేరని, తనను ఒకసారి కలిస్తే మళ్లీ ఎక్కడ కలిసినా గుర్తు పట్టి ఆప్యాయంగా పలకరించేవారని చెప్పారు. 

చిన్ననాటి మిత్రులు.. 
సూపర్‌ స్టార్‌ డమ్‌ వచ్చినా చిన్ననాటి ఫ్రెండ్స్‌ని మాత్రం కృష్ణ ఎప్పుడూ మరచిపోలేదని ఆయన స్నేహితులు అంటున్నారు. ‘‘కృష్ణ నేను కలిసి చదువుకున్నాం. తర్వాత కూడా ఆయనతో కలిసి పలు సినిమాల్లో నటించాను. సినిమాకు సంబంధించి అన్ని శాఖల  మీదా కృష్ణకు ఉన్నంత పట్టు నేను మరెవ్వరిలో చూడలేదు’’ అంటూ చెప్పారు నాగోలు నివాసి, ప్రముఖ సినీ విశ్లేషకులు ఎస్వీ రామారావు.   

కృష్ణ జ్ఞాపకాల్లో... 

నటశేఖరుడితో ఒక్కొక్కరిదీ ఒక్కో అనుభవం.. 
సూపర్‌స్టార్‌ని తలచుకుంటున్న నగరం 
ఒకసారి కలిస్తే మరచిపోలేం అంటున్న సిటీజనులు  


ఆయన గురించి పుస్తకం రాశా...  
‘సినిమా ప్రముఖుల గురించి పుస్తకాలు రాస్తున్న క్రమంలో కృష్ణగారిని కూడా కలిశాను. ఆయన గురించి రాస్తున్నాను అనగానే శుభాకాంక్షలు చెప్పారు’ అంటూ గుర్తు చేసుకున్నారు గురుప్రసాద్‌. తాను రాసిన సూపర్‌ స్టార్‌ పుస్తకాన్ని నగరానికి చెందిన కిన్నెర పబ్లికేషన్స్‌ ప్రచురించిందని, ఆ పుస్తకాన్ని కృష్ణగారి ఇంట్లోనే ఆవిష్కరించామని’ చెప్పారాయన. డేరింగ్‌ డాషింగ్‌ అనే పదాలకు సిసలైన అర్ధంగా నిలుస్తారంటూ కొనియాడారు.   ఇల్లు, పద్మాలయా ఆఫీసు, మరీ ముఖ్యమైన వేడుకల్లో తప్ప నగరంలో మరెక్కడా ఎవరినీ కలవడానికి కృష్ణ ఆసక్తి చూపేవారు కాదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సమకాలీకులతో పోటీగా ఏ రంగంలోనూ అయినా సై అనే కృష్ణ ఎన్టీయార్‌లాగే నగరంలో థియేటర్స్‌ ఏర్పాటు ఆలోచన కూడా చేశారని కొందరు అంటున్నారు. అయితే ఆ తర్వాత అది ఆచరణలో విజయవాడకు మారింది.  

సాయం చేసే గుణం... 
సూపర్‌ స్టార్‌ దాతృత్వం గురించి నిర్మాతల శ్రేయస్సు విషయంలో చూపే శ్రద్ధ గురించి సినీ పరిశ్రమలో కథలు కథలుగా చెప్పుకుంటారు. అయితే జూనియర్‌ ఆర్టిస్టులు, చిన్న చిన్న వేషాలు వేసుకునేవారి పట్ల కూడా అంతే ఉదారంగా ఆయన ప్రవర్తించేవారని కృష్ణానగర్‌ వాసులు అంటున్నారు. తన దగ్గర డూప్‌గా 20 ఏళ్ల పాటు పనిచేసిన నెల్లూరు వాసి ఆ తర్వాత అనారోగ్యం కారణంగా  మంచం పడితే..అతను బతికున్నంత వరకూ పనిచేసినప్పుడు ఇచ్చినట్టే అంతే మొత్తం నెలనెలా జీతంలా పంపేవారని గుర్తు చేసుకున్నారు.   

ఆప్యాయత చూపేవారు 
నానక్‌రాంగూడ వాసులంటే కృష్ణ, విజయనిర్మలకు చాలా ఇష్టం, ఎంతో ఆప్యాయంగా ఇంట్లోకి పిలిచి మాతో మాట్లాడేవారు. స్థానిక ఆలయాల అభివృద్దికి చేయూత అందించారు. ఎలాంటి పూజలు, శుభ కార్యాలున్నా సమయాన్ని బట్టి వచ్చేవారు. ఆ యనతో ఉన్న అనుబంధం మాటాల్లో చెప్పలేనిది. 
:::కైలాస్‌సింగ్‌– నానక్‌రాంగూడ 

పాన్‌ ఇండియా సినిమా ఆనాడే తీశారు.
మొదటి పాన్‌ ఇండియా సినిమాను ఆనాడే సూపర్‌స్టార్‌ కృష్ణ తీశారు. ‘మోసగాళ్లకు మోసగాడు’ అన్ని భాషల్లో తీసి సత్తా చాటారు. ఇది రష్యా దేశంలోనూ బాగా ఆడింది. మల్టీస్టారర్‌ సినిమాలను కూడా చాలా తీశారు. ‘హీరోలందంరం ఒక్కటిగా ఉంటాం. మీరెందుకు పోట్లాడుతారు. అందరినీ గౌరవించాలి’ అని అభిమాన సంఘాలను ఆదేశించేవారు. తుపాను వచ్చినప్పుడు ఆయన ఆదేశాలతో దివిసీమలో సేవా కార్యక్రమాలు చేపట్టాం. రక్తదాన, అన్నదాన, వైద్య శిబిరాలు నిర్వహించి ఆపన్నులను ఆదుకున్నాం.  ఆయనపై ఉన్న అభిమానంతో నా కుమారుడి పేరు కూడా కృష్ణగా పెట్టుకున్నా 
:::దిడ్డి రాంబాబు, కృష్ణ, మహేష్‌ సేన నాయకులు  

తట్టుకోలేక పోతున్నా... 
కృష్ణ మరణం తట్టుకోలేక పోతున్నా. వెంటనే ఆస్పత్రికి వచ్చాను. ఆయనపై ఉన్న అభిమానంతో పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నాను. అభిమాన సంఘాలతో కలిసి సేవాకార్యక్రమాలు చేపట్టాం. కృష్ణ లేడనే మాట వింటేనే ఎంతో బాధగా ఉంది. 
::: బి.కృష్ణ, బీడీఎల్‌ ఉద్యోగి 



ఏటా మా క్యాసెట్‌ను ఆవిష్కరించేవారు
ప్రతి యేటా మా కంపెనీ దివ్యజ్యోతి ఆడియోస్‌ క్యాసెట్‌ను మొదట కృష్ణ ఆవిష్కరించేవారు. ప్రతియేటా డిసెంబర్‌ 12న జరిగే అయ్యప్ప పూజల్లో పాల్గొనేవారు. స్థానిక ఆలయానికి ఎంతో సహకారం అందించారు. ఆయనతో నానక్‌రాంగూడకు 20 ఏళ్ళుగా ఎంతో అనుబంధం ఉంది. 
::: జి.ముత్యంరెడ్డి– నానక్‌రాంగూడ 



మా అమ్మాయి వివాహానికి హాజరయ్యారు 
కృష్ణ కుటుంబంతో నానక్‌రాంగూడకు 20 ఏళ్ళుగా అనుబంధం ఉంది. ఇద్దరూ మాకు పెద్ద దిక్కుగా ఉండేవారు. మా అమ్మాయి వివాహానికి కూడా ఆయన హజరయ్యారు. ఆయన మృతిని తట్టుకోలేకపోతున్నాం. 
:::రమేష్‌గౌడ్‌–నానక్‌రాంగూడ 

తరలివచ్చిన అభిమానగణం
అభిమానులతో నానక్‌రాంగూడ నిండిపోయింది. సూపర్‌స్టార్‌ కృష్ణ మృతి వార్త విన్న వెంటనే తెలుగు రాష్ట్రాల్లోని నలుమూలల నుంచి వేలాది మంది అభిమానులు ఆయన నివాసానికి తరలివచ్చారు. దీంతో ఇక్కడ భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ శ్రీనివాసరావు, మాదాపూర్‌ ఏసీపీ రఘునందన్‌రావు పర్యవేక్షణలో అభిమానులను కట్టడి చేయాల్సి వచ్చింది. ఊహించని రీతిలో నానక్‌రాంగూడకు అభిమానులు చేరుకోవడంతో విప్రో సర్కిల్‌ నుంచి నానక్‌రాంగూడలోని సూపర్‌స్టార్‌ కృష్ణ ఇంటి వరకున్న రోడ్డులో రాకపోకలు నిలిపివేశారు. అనంతరం సినీ, రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు కృష్ణ నివాసానికి రావడానికి మార్గం సుగమం చేశారు. ‘సూపర్‌ స్టార్‌ అ మర్‌ రహే’ నినాదాలతో ఆప్రాంతం హోరెత్తింది. నానక్‌రాంగూడలోని ఆయన నివాసంలో ప్రభుత్వవిప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాం«దీ, గచ్చి»ౌలి కార్పొరేటర్‌ గంగాధర్‌రెడ్డి కృష్ణకు నివాళులు అర్పించారు.  

విజయకృష్ణ నిలయం.. ఎంతో ప్రత్యేకం
నటశేఖర కృష్ణకు గచ్చిబౌలి డివిజన్‌లోని నానక్‌రాంగూడతో విడదీయలేని బంధం ఉండేది. ముఖ్యంగా నానక్‌రాంగూడలో నిర్మించిన తన స్వగృహం ‘విజయకృష్ణ నిలయం’ అంటే ఆయనకు అమితమైన ఇష్టం. నానక్‌రాంగూడలో 1996లో స్థలాన్ని కొనుగోలు చేశారు. అనంతరం అక్కడే ఇంటి నిర్మాణం చేసుకోవాలని నిర్ణయించి 2005లో నిర్మాణం పూర్తి చేసి దానికి ‘విజయకృష్ణ నిలయం’ అని నామకరణం చేశారు.  విజయకృష్ణ నిలయం ప్రాంగణంలోనే కృష్ణ, విజయనిర్మల దంపతులు కూరగాయలు, పండ్ల మొక్కలు నాటి పెంచారు.  ఈ నిలయంలో ప్రతిఏటా వారి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించేవారు.  అభిమానులు పెద్ద సంఖ్యలో దూరం నుంచి వచ్చి పుట్టిన రోజు సందర్భంగా కేక్‌ కట్‌ చేయించేవారు.  

9 ఏళ్లుగా కాంటినెంటల్‌ ఆస్పత్రికే... 
నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డ్రిస్టిక్ట్‌ ప్రాంతంలోని కాంటినెంటల్‌ ఆస్పత్రితో తొమ్మిదేళ్ల క్రితం అనుబంధం ఏర్పడింది.  ఇంటికి చేరువలోనే ఉండడంతో ఈ ఆస్పత్రిలో రెగ్యులర్‌ చెకప్‌ కోసం, చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినా వెళ్లేవారు. చివరకు చికిత్స పొందుతూ కాంటినెంటల్‌ ఆస్పత్రిలోనే మృతి చెందారు. అక్క డి వైద్యులు ముఖ్యంగా కాంటినెంటల్‌ ఆస్పత్రి చైర్మన్‌ డాక్టర్‌ గురు ఎన్‌ రెడ్డితో ఆయనకు మంచి స్నేహబంధం ఉంది. 

ప్రతియేటా సందడి.. 
నానక్‌రాంగూడకు చెందిన జి.ముత్యంరెడ్డి, డి.మాణిక్‌రెడ్డి నిర్మాతలుగా ఏర్పాటు చేసిన ‘దివ్యజ్యోతి ఆడియోస్‌’ అనే అయ్యప్ప స్వామి భక్తిగీతాల క్యాసెట్‌ను నటశేఖర కృష్ణ, విజయనిర్మల ప్రతి యేటా ఇక్కడే విడుదల చేసేవారు.  నానక్‌రాంగూడలో జరిగే పలు శుభకార్యాలు, పూజాకార్యక్రమాలకు తప్పకుండా హాజరయ్యేవారు. నానక్‌రాంగూడలోని అమ్మవారి ఆలయం అంటే కూడా కృష్ణ, విజయనిర్మలకు చాలా భక్తి ఉండేది. ప్రతి నెలా ఆలయానికి కొంత మొత్తం విరాళంగా ఇస్తూ వస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నానక్‌రాంగూడలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో విధిగా కృష్ణ, విజయనిర్మల, నరేష్‌తో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేవారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement