ఆడ శిశువును కొనుగోలు చేసిన దంపతులు
సిద్దిపేటఅర్బన్: పేగు బంధం తెంచుకొని పుట్టి రెండు రోజులు కాకముందే ఆడపిల్లను అమ్మకానికి పెట్టింది ఓ తల్లి. ఘటనకు సంబంధించి బాలల పరిరక్షణ విభాగం అధికారులు రాము, శిశుగృహ మేనేజర్ ఝాన్సీ, సామాజిక కార్యకర్త రాజారాం తెలిపిన వివరాల ప్రకారం..మిరుదొడ్డి మండలం మోతే గ్రామానికి చెందిన గొడుగు మంజులకు నాలుగో సంతానంగా సోమవారం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఆడ శిశువు జన్మించింది.
మంజులకు గతంలో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉండగా మరో ఇద్దరు పుట్టి చనిపోయారు. కాగా మంజుల భర్త సైతం ఆదివారం చనిపోగా అంత్యక్రి యలు పూర్తి చేసిన అనంతరం పురిటి నొప్పులు రావడంతో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. చేసేదేమి లేక తల్లి బూరుగుపల్లి శివారుకు చేరుకొని ముందుగా చేసుకున్న ఒప్పందం మేరకు గజ్వేల్‌కు చెందిన ఎండీ జామీన్, ముంతాజ్ దంపతులకు రూ. 20 వేలకు అమ్మేసింది.
దీన్ని గమనించిన స్థానికులు 1098కు సమాచారం ఇవ్వడంతో బాలల పరిరక్షణ అధికారులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించి శిశువును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి బాలసదనంకు తల్లిని, శిశువును తరలించారు. తన భర్త రెండు రోజుల క్రితం చనిపోవడంతో చేతిలో డబ్బులు లేకపోవడం, ఆడపిల్లను పోషించే పరిస్థితి లేక విక్రయించినట్టు తల్లి మంజుల తెలిపింది. బుధవారం శిశువును కొనుగోలు చేసిన వారిని, తల్లిని, శిశువును సీడబ్ల్యూసీ ముందు హాజరుపర్చనున్నట్టు బాలల పరిరక్షణ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment