
● చివరి క్షణంలో మిఛాంగ్ తుపాన్ దెబ్బ ● 51,261 ఎకరాల్లో రూ.51 కోట్ల పంట నష్టం ● పత్తి ధర ఢమాల్, నిండా మునిగిన వరి రైతులు ● గత ఏడాదితో పోలిస్తే పెరిగిన సాగు ● మొదట్లో అనుకున్న స్థాయిలో వర్షాలు ● రైతుబంధు, రైతు బీమా కాస్త ఊరట
సిద్దిపేట జిల్లాలో వానాకాలం సాగులో భాగంగా రైతులు 5,27,906 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేశారు. ఇందులో అత్యధికంగా వరి 3,66,169 ఎకరాల్లో సాగు చేశారు. ఉద్యాన పంటలు అయిన ఆయిల్‌పామ్, మల్బరీ, మామిడి, సపోట, బొప్పాయి, టమాట పంటలతోపాటుగా ఇతర నూతన పంటల సాగుకు రైతులు మక్కువ చూపారు.
వణికించిన తుపాన్..
జిల్లాలో వానాకాలం పంటలు చేతికందే సమయంలో మిఛాంగ్ తుపాన్ రైతులను బెంబేలెత్తించింది. వరి పంటను కోసి ఆరబెట్టిన ధాన్యం, అదే విధంగా కోత దశలో ఉన్న వరి పంట అధికంగా దెబ్బతింది. 5 రోజులపాటుగా మిఛాంగ్ తుపాన్ జిల్లాను వణికించింది. దీంతో జిల్లాలో 65,056 మంది రైతులకు చెందిన 51,261 ఎకరాల్లో రూ.51 కోట్ల మేర వరితో పాటుగా ఇతర పంటలు దెబ్బతిన్నాయి.
పత్తి రైతు చిత్తు..
జిల్లాలో పత్తి వేసిన రైతులు ధరతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 1.08లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా సేకరించే దశలో ధరలు పడిపోయాయి. 2022లో గరిష్ట ధర రూ.9 వేల వరకు పలికింది. 2023లో మాత్రం రూ.6500 మాత్రమే ఉంది. దీంతో పత్తి రైతులు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 1.60 లక్షల క్వింటాళ్ల పత్తిని ప్రభుత్వ, ప్రైవేట్ వ్యాపారులు ఖరీదు చేశారు.
టాప్ గేర్‌లో టమాట
జిల్లాలో టమాట సాగు చేసిన రైతులకు ఈ సంవత్సరం ఆశించిన ధర కంటే అధిక ధర రావడంతో టాప్ గేర్‌లోకి దూసుకెళ్లారు. జిల్లాలో 700 ఎకరాల్లో టమాటను రైతులు సాగు చేశారు. దీంతో ఎకరకు 18 టన్నుల దిగుబడి వచ్చింది. రెండు నెలలపాటు టమాట ధర రూ.100కు పైగా ఉండడంతో రైతులు తమ కష్టానికి మించి ప్రతిఫలం అందుకున్నారు.
ఆదుకుంటున్న రైతుబంధు, రైతుబీమా
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం సత్ఫలితాలనిచ్చింది. వానాకాలం రైతుబంధుకు గాను 3,19,852 మంది రైతులకు రూ.313.23 కోట్లు అందాయి. కానీ యాసంగి రైతుబంధు ఇప్పటి వరకు 97,777 మంది రైతులకు రూ.20.30 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. జిల్లాలో 361 మంది రైతులు మరణించగా వారి కుటుంబీకులకు రూ.18.05 కోట్ల రైతు బీమాను రాష్ట్ర ప్రభుత్వం అందించింది.
అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంట
Comments
Please login to add a commentAdd a comment