సంగారెడ్డి టౌన్: ప్రమాదవశాత్తు నీటి కెనాల్‌లో పడి కార్మికుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఫసల్ వాది గ్రామానికి చెందిన ఖదీర్ (36) గణపతి చక్కెర పరిశ్రమలో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తున్నాడు. పరిశ్రమ ఆవరణలో ఉన్న నీటి కెనాల్ లో శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తు కాలుజారి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిలల్లు ఉన్నారు. పరిశ్రమ నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించి ఆర్థికంగా ఆదుకుంటామని పరిశ్రమ యాజమాన్యం హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలంలో డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, సంగారెడ్డి రూరల్ సీఐ సుధీర్ కుమార్, ఎస్సై రాజేశ్ నాయక్ యాజమాన్యం ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment