
బోరు మోటారు వేసేందుకు వెళ్లి..
● ప్రమాదవశాత్తు బావిలో పడి రైతు మృతి ● తున్కిబొల్లారంలో ఘటన
ములుగు(గజ్వేల్): కౌలుకు తీసుకున్న పొలం వద్ద బోరు మోటారు వేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి కౌలు రైతు మృతి చెందిన ఘటన మండలం తున్కిబొల్లారంలో శనివారం చోటుచేసుకుంది. మృతుడు మామిడ్యాల ఆర్‌అండ్‌ఆర్ కాలనీ వాసి. ఎస్‌ఐ విజయ్‌కుమార్ కథనం ప్రకారం.. ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన బొమ్మ యాదగిరి(55)కి భార్య యాదమ్మ, కొడుకు నాగరాజు ఉన్నారు. పొరుగునే ఉన్న తున్కిబొల్లారంలో కొంత భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటున్నాడు. శనివారం భార్య, కొడుకుతో కలసి పొలం వద్దకు వెళ్లిన యాదగిరి బోరు మోటారు వేసి వస్తానని చెప్పి బావివద్దకు వెవెళ్లాడు. అతను తిరిగి రాకపోవడంతో భార్య, కొడుకు పరిసర ప్రాంతాల్లో వెతికినప్పటికీ జాడ తెలియలేదు. బోరు బావి గడ్డమీద యాదగిరి తువాల కనపడటంతో అతను ప్రమాదవశాత్తు బావిలో పడి ఉంటాడని వెతికారు. బావిలో యాదగిరి మృతదేహం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment