
తండ్రి మృతిపై అనుమానం
పటాన్‌చెరు టౌన్: తండ్రి మృతిపై అనుమానం ఉందని కుమారుడు ఫిర్యాదు చేసిన సంఘటన అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలం లింగాయపల్లి సొమ్ల తండాకు చెందిన బానోత్ గోపాల్ 10 సంవత్సరాల క్రితం భార్య లక్ష్మి, పిల్లలతో కలిసి అమీన్‌పూర్‌కు వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో 14 రాత్రి గోపాల్ చెత్త పడేసి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు గోపాల్ కోసం స్థానికంగా వెతుకుతుండగా 15వ తేదీ సాయంత్రం అమీన్‌పూర్ గ్రేవీ యార్డ్ వెనుక ఉన్న రాళ్లలో గోపాల్ మృతదేహం కనిపించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తండ్రి మృతిపై అనుమానం ఉందని కుమారుడు బానోత్ సుధీర్ ఆదివారం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అగ్ని ప్రమాదంలో
గడ్డివాము, స్ప్రింక్లర్లు దగ్ధం
బెజ్జంకి(సిద్దిపేట): బెజ్జంకి శివారులోని డబుల్ బెడ్రూం ఇళ్ల సమీపంలో ఆదివారం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. వ్యవసాయ భూములలో ఎలాంటి పంటలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని పోతారం శివారు వరకు వ్యవసాయ భూములలో మంటలు వ్యాపించి కట్కూరు శంకర్‌కు చెందిన గడ్డివాము దగ్ధమైంది. ప్రశాంత్‌కు చెందిన ఆయిల్ పామ్ చెట్లు, స్ప్రింక్లర్ పైపులు దగ్ధమయ్యాయి. సకాలంలో రైతులు మంటలను ఆర్పివేశారు.
వ్యక్తిపై కేసు నమోదు
సిద్దిపేటరూరల్: మెడలో నుంచి బంగారు గొలుసు తస్కరించేందుకు యత్నించిన గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదైంది. ఈ ఘటన పోలిస్‌స్టేషన్ పరిధిలోని ఆదివారం చోటు చేసుకుంది. చిన్నగుండవెల్లికి చెందిన మంద శంక రవ్వ ఆదివారం తన వ్యవసాయ భావి వద్దకు వెళ్లి మధ్యాహ్నం సమయంలో ఇంటికి వెళ్తోంది. ఈ క్రమంలో శంకరవ్వకు ఎదురుగా గ్రామం నుంచి బైక్‌పై వస్తున్న గుర్తు తెలియని వ్యక్తి సిద్దిపేటకు ఎలా వెళ్ళాలి అని అడగడంతో వివరాలు చెప్పింది. దీంతో వెళ్లిపోయినట్లు నటించిన వ్యక్తి మళ్లీ శంకరవ్వ వద్దకు వచ్చి మెడలో ఉన్న 3 తులాల బంగారు గొలుసుని లాక్కునే ప్రయత్నం చేశాడు. దీంతో గట్టిగా అరవడంతో అటుగా వెళ్తున్న గ్రామస్థులు అక్కడికి వచ్చారు. గమనించిన దొంగ బైక్‌పై పారిపోయాడని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అపూర్వరెడ్డి తెలిపారు.
నూరేళ్ల వృద్ధుడు మృతి
జహీరాబాద్ టౌన్: మండలంలోని అల్గోల్ గ్రామంలో నూరేళ్ల వయస్సు ఉన్న వృద్ధుడు మృతి చెందాడు. సి. పెంటారెడ్డి(100) భార్య నలుగురు సంతానం. ముగ్గురు ఆడపిల్లలు ఒక కొడుకు. కుమారుడు మృతి చెందగా కోడలు మనవళ్లు హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆయనకు ఉర్దూ, తెలుగు భాషలపై మంచి పట్టు ఉంది. గ్రామస్తులతో స్నేహపూర్వకంగా ఉంటూ దేశ స్వాతంత్య్రం, నిజాంరాజు గురించి ప్రజలకు వివరించే వారు. రోడ్డుపై వెళ్తున్న సమయంలో అదుపుతప్పి కిందపడ్డాడు. అప్పటి నుంచి మంచం పట్టి మృతి చెందాడు.

తండ్రి మృతిపై అనుమానం
Comments
Please login to add a commentAdd a comment