
డీసీఎంను ఢీకొట్టిన కారు, ఒకరి మృతి
నలుగురికి తీవ్ర గాయాలు
కొండపాక(గజ్వేల్): డీసీఎం వాహనాన్ని వెనుక నుంచి ఓ కారు ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని తిమ్మారెడ్డిపల్లి శివారులో ఆదివారం చోటు చేసుకుంది. కుకునూరుపల్లి ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట(ప్రగతినగర్)లో ముగ్గురు అన్నదమ్ములు చంద వెంకటేశ్, భీమయ్య, సురేశ్ నివాసం ఉంటున్నారు. వారు సెంట్రింగ్ కాంట్రాక్టు పనులు చేసుకొంటూ జీవనం సాగిస్తుంటారు. ఈ నెల 13న భీమయ్య కుమారుడి వివాహం జరిగింది. కొమురంభీం జిల్లా కౌటులం గ్రామంలో వివాహ అనంతరం జరిగే కార్యక్రమం నిమిత్తం అన్నదమ్ముల కుటుంబ సభ్యులు, వారి బంధువులు వేర్వేరు కార్లలో ఆదివారం ఉదయం బయలు దేరారు. ఈ క్రమంలో మండలంలోని తిమ్మారెడ్డిపల్లి శివారులో రాజీవ్ రహదారి ప్రక్కన ముందు ఆగిన ఓ డీసీఎంను వెనుక నుంచి ఢీకొట్టారు. దీంతో కారు డ్రైవరు ప్రక్క సీట్లో కూర్చున్న చంద సురేశ్ అక్కడిక్కడే మృతి చెందగా మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకొని అక్కడికి చేరిన పోలీసులు క్షతగాత్రులను అంబులెన్సులో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సదాశివపేటకు చెందిన డీసీఎం డ్రైవరు మన్సూర్ అలీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

డీసీఎంను ఢీకొట్టిన కారు, ఒకరి మృతి
Comments
Please login to add a commentAdd a comment