
కష్టం
కుళ్లిపోయి.. చచ్చిపోతున్న వరి
ఎ‘వరి’కీ
రాకూడని
● నాట్లేసి 45 రోజులు గడుస్తున్నా ఎదుగుదల లేని పంట
● జిల్లాలో పెద్ద ఎత్తున సాగు
● ఏ మందులు వాడినా దక్కని ఫలితం
● దున్ని.. మళ్లీ నాట్లేస్తున్న రైతులు
● పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు
మొగిపురుగు, వాతావరణ
పరిస్థితులే కారణమంటున్న
శాస్త్రవేత్తలు, అధికారులు
నాట్లేసి 45 రోజులు గడుస్తున్నా ఎదుగుదల లేని పంట
దుబ్బాక: యాసంగిలో వరి పంట వేసిన రైతులకు మొదట్లోనే కష్టాలు మొదలవుతున్నాయి. ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని.. అప్పులు తె చ్చి.. పుట్టెడు పెట్టుబడులు పెట్టి వరి పంట సాగు చేస్తే చేతికొస్తుందన్న గ్యారంటీ లేక జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చెందుతున్నారు. వానా కాలంలో మొగి పురుగు రోగం, భారీ వర్షాలతో పంటలు దెబ్బతిని దిగుబడులు రాక రైతులకు పెట్టుబడులు మీద పడ్డాయి. ఈ యాసంగిలోనైనా పంట బాగా పండుతాయన్న గంపెడాశతో పెద్ద ఎత్తున వరి పంటలు సాగు చేశారు. తీరా వరినాట్లు వేసి నెలరోజులు గడుస్తున్నా పంట పచ్చబడటం లేదు.
మరోసారి నాట్లు
మొక్క ఎదగకుండా ఎర్రబడి కుళ్లిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు వేసినప్పటి నుంచి రకరకాల మందులు చేసినా.. వివిధ రకాల క్రిమి సంహారక మందులు చల్లినా పంట కోలుకోవడం లేదు. ఎదుగుదల లేకుండా కుళ్లిపోతూ మొక్కలు చచ్చిపోయి పొలాల్లో పెద్ద గ్యాబులు (ఖాళీ స్థలాలు) ఏర్పడుతున్నాయి. వ్యవసాయాధికారులు..డాట్ సెంటర్ సైంటిస్టులు సైతం జిల్లాలో ఎర్రబడి ఎదుగుదల లేని వరి పంటలను పరిశీలిస్తున్నారు. చాలా మంది రైతులు వేసిన వరినాట్లు కుళ్లిపోయి చనిపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వేసిన నాటును దున్నేసి మళ్లీ నాట్లు వేశారు.
3 లక్షలకు పై చిలుకు ఎకరాల్లో సాగు..
జిల్లాలో చెరువులు, కుంటల్లో నీరు సమృద్ధిగా ఉండటంతో ఈ యాసంగిలో రైతులు పెద్ద ఎత్తున వరి సాగు చేశారు. ఈసారి 3.50 లక్షల ఎకరాల్లో సాగు అవుతుందని వ్యవసాయాధికారుల అంచనా ఉండగా ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా ఎకరాల్లో సాగు పూర్తి అయ్యింది. ఇంకా వరి నాట్లు వేస్తూనే ఉన్నారు.
ఇష్ట మొచ్చిన మందులు
పంట ఎదుగుదల లేకుండా ఎర్రగా మారి కుళ్లిపోతుండటంతో రైతులు రకరకాల మందులను , గులకలను తెచ్చి ఇష్టం మొచ్చినట్లుగా చల్లుతున్నారు. ఫర్టిలైజర్ దుకణాల్లో వారు ఏ మందులు ఇస్తే అవి తెచ్చి స్ప్రే చేస్తున్నారు. పుట్టెడు అప్పులు తెచ్చి ఎన్ని మందులు చల్లినా ఫలితం లేకపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
వాతావరణ పరిస్థితులే కారణం
వరి పంటలు కుళ్లిపోతూ ఎదుగుదల లేకపోవడానికి మొగి పురుగు ఉధృతి, వాతావరణ పరిస్థితులే కారణమంటూ వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. జిల్లాలో పలు వరి పంటలను డాట్ సెంటర్ శారస్త్‌రవేత్తలతోపాటు వ్యవసాయాధికారులు పరిశీలించారు..ఈ సందర్భంగా వారు పలు సూచనలు రైతులకు ఇచ్చారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
రైతులు పొలాల్లో ఎక్కువ నీరు నిల్వ ఉంచకుండా అరబెడుతూ నీరు పెట్టాలి
ఇష్టం వచ్చిన మందులు చల్లవద్దు ఎండ తీవ్రత పెరిగితే యధావిధిగా పంటలు కోలుకుంటాయి.
మొగిపురుగు నివారణకు 4జీ గుళికలు వేసుకోవాలి.
ఫర్టిలైజర్ల డీలర్లకు కూడా ఏ మందులు పడితే అవి ఇవ్వొద్దని తాము సూచించిన మందులే రైతులకు ఇవ్వాలని చెబుతున్నాం
రైతులు వ్యవసాయ అధికారుల సూచనల మేరకే మందులు వేసుకోవాలి. లేకుంటే పంటకు ఫలితం ఇవ్వక పోవడమే కాకుండా ఆర్థికంగా నష్టం వాటిల్లుతుంది.
Comments
Please login to add a commentAdd a comment