
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు విద్యార్థుల ఎంపిక
సిద్దిపేటరూరల్: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు చింతమడక పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎంపికై నట్లు పాఠశాల యాజమాన్యం సోమవారం తెలిపారు. పాఠశాలలో 9వ తరగతికి చెందిన శ్రీలాస్య, వైష్ణవి జిల్లా అథ్లెటిక్స్ పోటీల్లో 400 మీటర్స్ పరుగుపందెంలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి రాజిరెడ్డి, ఉపాధ్యాయ బృందం విద్యార్థులను అభినందించారు.
నిందితుడిని పట్టించిన
కాల్‌డేటా
● ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
● పెట్రోల్ పోసి నిప్పంటించి
మహిళ హత్య
మెదక్ మున్సిపాలిటీ: అదృశ్యమైన వివాహిత దారుణహత్యకు గురికాగా.. కాల్‌డేటా హంతకుడిని పట్టించింది. వివాహేతర సంబంధంతో మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించి హతమార్చిన ఘటనకు సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. మెదక్ పట్టణ సీఐ నాగరాజు కథనం మేరకు.. మెదక్ పట్టణంలోని ఫతేనగర్‌లో నివసించే మంగలి రేణుక(45) స్థానికంగా ఓ ఆస్పత్రిలో స్వీపర్‌గా పనిచేస్తుంది. 6న సదరు మహిళ కనిపించకుండా పోవడంతో ఆమె కుమారుడు శ్రీనాథ్ 8న పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు మహిళ సెల్‌ఫోన్ కాల్ డేటాను పరిశీలించగా చిన్నశంకరంపేట మండలం ఎస్.కొండాపూర్ గ్రామానికి చెందిన బత్తుల యేసు ఆఖరి కాల్ ఉంది. దాని ఆధారంగా అతడిని పట్టుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయట పడింది. రేణుకతో వివాహేతర సంబంధం కలిగి ఉన్న బత్తులయేసు 6న ఎస్.కొండాపూర్ అడవి ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. అక్కడే ఆమైపె పెట్రోల్‌పోసి నిప్పంటించి హతమార్చాడు. నేరం ఒప్పుకోవడంతో ఆదివారం నిందితుడిని అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
15 మేకలు సజీవ దహనం
● మరో పదింటికి గాయాలు
● నాదులాపూర్‌లో పాకకు నిప్పు
వట్‌పల్లి(అందోల్): మేకల పాకకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో 15 మేకలు సజీవ దహనమయ్యాయి. ఈ ఘటన అందోలు మండల పరిధిలోని నాదులాపూర్ గ్రామంలో ఆదివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కలాలి రమేశ్ తనకున్న 25 మేకలను ఎప్పటిలాగే ఆదివారం ఇంటి వెనుకాల ఉన్న పాకలో కట్టేశాడు. అర్థరాత్రి పూట మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల వారు గమనించి రమేశ్‌కు తెలిపారు. ఇరుగుపొరుగు వారి సాయంతో మంటలార్పే ప్రయత్నం చేసినా 15 మేకలు చనిపోగా, మరో 10 మేకలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సుమారు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మేకల పోషణే జీవనాధారంగా చేసుకొని జీవిస్తున్న తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. వెటర్నరీ అధికారులు మృతి చెందిన మూగజీవాలను పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి ఇస్తామని తెలియజేశారు. బాధితులు జోగిపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు విద్యార్థుల ఎంపిక
Comments
Please login to add a commentAdd a comment