ఇక సివిల్ పనులు
బోరంచ పంప్‌హౌస్ నిర్మాణంలో ముందడుగు
● హరీశ్ పాదయాత్ర నేపథ్యంలో కీలక నిర్ణయం
● ప్రతిపాదిత స్థలం వద్ద ఐదెకరాలు లీజుకు తీసుకున్న కాంట్రాక్టు కంపెనీ
● సిమెంట్ పనుల ప్రారంభానికి సమాయత్తం
బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనుల ప్రగతిలో కీలక ముందడుగు పడుతోంది. ఈ భారీ సాగునీటి ప్రాజెక్టు పంప్‌హౌస్ నిర్మాణానికి సంబంధించి సివిల్ పనులను ప్రారంభించేందుకు కాంట్రాక్టు కంపెనీ సమాయత్తమవుతోంది. ఈ మేరకు పంప్‌హౌస్ సమీపంలోని ఐదు ఎకరాల ప్రైవేటు భూమిని లీజుకు తీసుకుంది. సివిల్ పనులకు సంబంధించిన మెటీరియల్‌ను డంప్ చేయనుందని నీటి పారుదలశాఖ వర్గాలు చెబుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అందోల్, నారాయణఖేడ్‌తో పాటు, మెదక్‌జిల్లాలోని కొన్ని మండలాల పరిధిలో 1.65 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించడమే లక్ష్యంగా ఈ బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి బీఆర్‌ఎస్ సర్కార్ శ్రీకారం చుట్టిన విషయం విదితమే. ఈ పనుల్లో భాగంగా మనూరు మండలం బోరంచ వద్ద మొదటి పంప్‌హౌస్‌ను నిర్మించి.. సింగూరు జలాశయం నుంచి బ్యాక్ వాటర్‌ను 8 టీఎంసీల ఎత్తిపోసేలా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఇందుకోసం ఈ బోరంచ వద్ద ఈ పంప్‌హౌస్ నిర్మిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ పంప్‌హౌస్ కోసం ఎర్త్ వర్క్ జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే ఈ పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాల పనులను వేగవంతం చేయాలనే డిమాండ్‌తో బీఆర్‌ఎస్ పోరాటానికి సిద్ధమవుతోంది. ఇటీవల మాజీ మంత్రి హరీశ్‌రావు నివాసంలో జిల్లా ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్ కీలక నేతలు సమావేశమై ఈ సాగునీటి పథకాల సాధన కోసం పోరాటం చేయాలని నిర్ణయించింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఈ ఎత్తిపోతల పథకాల ఆయకట్టు ఉన్న నియోజకవర్గాల్లో పాదయాత్ర కూడా చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నీటిపారుదలశాఖ ఈ పంప్‌హౌస్‌కు సంబంధించిన సివిల్ పనులను ప్రారంభిస్తోంది. త్వరలోనే కాంట్రాక్టు కంపెనీ ఈ పనులకు సంబంధించిన మెటీరియల్‌ను మోహరించనుందని నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
రెండు పంప్‌హౌస్‌లు
ఈ ఎత్తిపోతల పథకం కోసం రెండు పంప్‌హౌస్‌లను నిర్మిస్తున్నారు. మనూరు మండలం బోరంచ వద్ద మొదటి పంప్‌హౌస్ కాగా, రెండో పంప్‌హౌస్ రాంతీర్థ్ (కంగ్టి మండలం) వద్ద నిర్మించనున్నారు. బోరంచ వద్ద మొత్తం 12 పంపులను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఎనిమిది పంపుల ద్వారా సాగునీటిని రాణాపూర్‌కు తరలిస్తారు. అక్కడి నుంచి గ్రావెటీ కెనాల్ ద్వారా పంట పొలాలకు సాగునీటిని పారించేలా దీన్ని డిజైన్ చేశారు. రెండు పంపుల ద్వారా దూదుగొండ (మెదక్ జిల్లా రేగోడ్ సమీపంలో)కు నీటిని లిఫ్ట్ చేస్తారు. మరో రెండు పంపులు ద్వారా లింగంపల్లి (వట్‌పల్లి మండలం) వరకు ఎత్తిపోయనున్నారు. అక్కడి నుంచి గ్రావెటీ కెనాల్ ద్వారా నీటిని ఆయకట్టుకు తరలిస్తారు.
సుమారు రూ.15 కోట్ల మేరకు పనులు
బసవేశ్వర ఎత్తిపోతల పథకం నిర్మాణ అంచనా వ్యయం రూ.1,774 కోట్లు కాగా, ఇందులో కాంట్రాక్టర్ చేసే పనుల విలువ రూ.1,478 కోట్లు. ఇప్పటి వరకు రూ.15 కోట్ల మేర పనులకు నీటిపారుదలశాఖ ఎంబీ రికార్డు చేయగా, మరో ఐదు కోట్ల మేరకు పనులు జరిగాయని ఆశాఖ అధికారులు చెబుతున్నారు.
సివిల్ పనులు ప్రారంభిస్తాం
బోరంచ పంప్‌హౌస్‌కు సంబంధించి సివిల్ పనులను అతికొద్ది రోజుల్లోనే ప్రారంభిస్తాం. ఈ సివిల్ పనుల ప్రారంభానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను కాంట్రాక్టు కంపెనీ చేపట్టింది. పంప్‌హౌస్ వద్ద క్యాంపు ఏర్పాటు చేసేందుకు కాంట్రాక్టు కంపెనీ చర్యలు చేపట్టింది.
–జలందర్,
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
Comments
Please login to add a commentAdd a comment