ప్రతి పనికి పైసా.. ఏ కైసా?
● ట్రాన్స్‌కోలో లంచం షరా మామూలే..
● ఫిర్యాదు చేసిన వారిపై వేధింపులు
పటాన్‌చెరు: విద్యుత్‌శాఖలో ప్రతీ పనికి లంచం షరా మామూలుగా మారింది. ఎంతో కొంత ముట్ట చెప్పంది ఏ పనీ ముందుకు సాగడం లేదు. ఇవ్వకపోతే వినియోగదారులను ముప్పు తిప్పలు పెడుతూ.. మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. దళారులను విద్యుత్ సంస్థల ఇంజనీరింగ్ అధికారులు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అపార్టుమెంట్లు, కొత్త వెంచర్లకు విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరుకు రూ.లక్షల్లో లంచం డిమాండ్ చేస్తున్నారని సమాచారం. పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారిన గ్రామాల్లో ఆక్యుపెన్సీ, ఎన్‌ఓసీల పేరిట విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. అడిగినంత చెల్లిస్తే పంచాయతీ అనుమతితో కూడిన భవనాలకు అప్పటికప్పుడు విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నారు. ప్రజాప్రతినిధులు ఫోన్ చేసినా స్పందించని అధికారులు, దళారులు ద్వారా వెళితే మాత్రం పనులు పూర్తిచేస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతంలో లైన్‌మెన్ దర్శనం కూడా సామాన్యులకు కష్టంగా మారింది. విద్యుత్ సంస్థల్లో అయా పోస్టింగ్‌ల కోసం పెద్దఎత్తున పైరవీలు చేసి ఇక్కడకు బదిలీపై వస్తున్నారు. క్షేత్రస్థాయిలో తమ వారికి పోస్టింగ్‌లు ఇచ్చిన రాష్ట్రస్థాయి అధికారులు వాటాలు తీసుకుంటున్నారని బహిరంగ చర్చ జరుగుతుంది. అధికారులపై ఫిర్యాదులు అందినప్పుడు విచారణ చేయాల్సిన విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు ఇచ్చిన వారిని ఇబ్బంది పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇవీ రేట్లు..
కొత్త మీటరు కోసం రూ. ఆరు నుంచి రూ. పది వేలు, ప్యానల్ బోర్ల కోసం రూ.45 వేలు, అపార్ట్‌మెంట్ ట్రాన్స్‌ఫార్మర్ కోసం రూ.1.5 నుంచి రూ. 2లక్షలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వెంచర్లలో విద్యుత్ కనెక్షన్లు, వైర్లు వేసేందుకు అనుమతి, ఇతర పనుల కోసం రూ. కోట్లలో డిమాండ్ చేస్తున్నారు. పటాన్‌చెరులో ఓ భారీ వెంచర్‌లో విద్యుత్ కనెక్షన్ కోసం కేవలం లంచం సొమ్మునే రూ. ఏడు కోట్ల వరకు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
నా దృష్టికి రాలేదు
నా దృష్టికై తే ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. ఎవరైనా ఇబ్బంది పడితే తనకు ఫిర్యాదు చేయవచ్చు. ఎలాంటి అవినీతికి తావు లేని వ్యవస్థ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఆన్‌లైన్ ద్వారానే కస్టమర్లు తమకు కావాల్సిన సేవలను పొందవచ్చు. ఆఫీసుకు రానవసరం లేదు. దళారులను ఆశ్రయించాల్సిన పనే లేదు. నేను ఇటీవలే బదిలీపై వచ్చాను. వినియోగదారులకుకు ఎలాంటి ఇబ్బంది లేని సేవలు అందించేందుకు కృషి చేస్తా.
– సంజీవ్, ఏడీఈ, టీజీఎస్‌పీడీసీఎల్
Comments
Please login to add a commentAdd a comment