బీమా డబ్బుల కోసం బావ హత్య
● బామ్మర్ది సహా మరొకరు అరెస్టు
● అమీన్‌పూర్‌లో ఘటన
పటాన్‌చెరు టౌన్: బీమా డబ్బుల కోసం సొంత బావను హత్య చేశాడు. సీఐ కథనం ప్రకారం.. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లింగాయపల్లి సొమ్ల తండాకు చెందిన భానోత్ గోపాల్ బతుకుదెరువు కోసం పదేళ్ల కిందట భార్య లక్ష్మి, పిల్లలతో కలిసి అమీన్‌పూర్‌కు వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 14న రాత్రి గోపాల్ చెత్త పారివేసి వస్తానని ఇంట్లోంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతుకుతుండగా 15న సాయంత్రం అమీన్‌పూర్ శ్మశానవాటిక వెనుక మృతదేహమై కనిపించాడు. మృతుడి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో భాగంగా.. గోపాల్ బామ్మర్ది నరేశ్ నాయక్, నరేశ్ మేనమామ దేవిసింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా.. తామే హత్య చేశామని అంగీకరించారని సీఐ తెలిపారు. ఏడాది కిందట గోపాల్ నాయక్ పేరు మీద నరేశ్, దేవిసింగ్ బ్యాంకు రుణంతో జేసీబీ తీసుకున్నారు. గోపాల్ నాయక్‌పై రిస్క్ ఇన్సూరెన్స్‌తోపాటు రూ.29 లక్షలు ఎల్‌ఐసీ ఇన్సూరెన్స్ చేయించారు. జేసీబీ వ్యాపారం సరిగా నడవకపోవడంతో అప్పులు చేసిన నరేశ్.. బావ చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని భావించాడు. 14న పథకం ప్రకారం మద్యం సేవిద్దామని గోపాల్ నాయక్‌ను అమీన్‌పూర్ శ్మశానవాటిక వద్దకు నరేశ్ పిలిచాడు. అక్కడే నరేశ్ మేనమామ దేవిసింగ్ సాయంతో బావను చున్నీతో ఉరి వేసి హత్య చేశాడు. అనారోగ్యంతో సాధారణంగా మృతి చెందాడని నమ్మించే ప్రయత్నం చేసేందుకు చూశారు. ఫోన్ చేసి పిలవడంతో ఇద్దరిని అనుమానించిన పోలీసులు.. తమదైన శైలిలో విచారణ చేపట్టి టేక్మాల్ మండలం షాబాద్ తండాకి చెందిన నరేశ్ నాయక్, వెంకట్రావు తండాకి చెందిన దేవి సింగ్ సోమవారం రిమాండ్‌కు తరలించారు.
బీమా డబ్బుల కోసం బావ హత్య
Comments
Please login to add a commentAdd a comment