
పెరిగిన బియ్యం కోటా
సిద్దిపేటరూరల్: కొత్త రేషన్‌కార్డుల మంజూరు జిల్లాలో పంపిణీ చేసే బియ్యం కోటా ఈనెల నుంచి పెరిగింది. పదేళ్ల కాలంలో నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ లేకపోవడంతో ప్రస్తుత ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేసింది. దీంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అర్హులైన లబ్ధిదారుల కల నెరవేరింది. జిల్లాలో మొదటి విడతగా 888 కుటుంబాల వారు అర్హత సాధించినట్లు వివరాలను వెల్లడించారు. వారందరికీ ఫిబ్రవరి నుంచే రేషన్ బియ్యం అందజేస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో రేషన్ పంపిణీ చేసే బియ్యం అదనంగా 12 మెట్రిక్ టన్నులకు పెరిగింది.
జిల్లాలో ఇప్పటి వరకు గ్రామసభలు, ప్రజాపాలన కేంద్రాల్లో స్వీకరిస్తున్న దరఖాస్తుల్లో నూతన రేషన్‌కార్డులు, చేర్పులు, తొలగింపు వంటి వాటికి సంబంధించి 74 వేల 272 దరఖాస్తులు వచ్చాయి. ఈ మేరకు సంబంధిత అధికార యంత్రాంగం సర్వే పూర్తి చేయడంతో పాటుగా అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది. మరి కొంతమంది మంజూరు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
కొత్త కార్డు వచ్చింది
ప్రభుత్వ చేపట్టిన ఇంటింటి సర్వే సమయంలో నూతన రేషన్‌కార్డు కోసం దరఖాస్తు అందించాను. గత నెలలో నా పేరు మీద నూతన రేషన్‌కార్డు వచ్చింది. చాలా రోజులుగా రేషన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్నాం. ఇప్పటికై నా రావడం చాలా సంతోషంగా ఉంది. దీంతో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను పోందెందుకు అవకాశం ఉంది.
– పుల్లగూర్ల తేజ, రాఘవాపూర్
అర్హులందరికీ అందిస్తాం
జిల్లాలో ఇటీవల 888 నూతన రేషన్ కార్డులు మంజూరు చేయడంతోపాటు 1,900 మంది పేర్లను రేషన్ కార్డుల్లో కొత్తగా చేర్చాం. వీరికి బియ్యం అందించడం జరుగుతుంది. కొత్త కార్డులు రావడం, పాత కార్డుల్లో మార్పులు, చేర్పులు జరగడంతో జిల్లాలో ఈ నెల రేషన్ బియ్యం కోటా 12 మెట్రిక్ టన్నులకు పెరిగింది. తమ వద్ద ఉన్న దరఖాస్తులను పరిశీలించడం జరుగుతుంది.
– తనూజ, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి
888 నూతన కార్డులు
జిల్లాలో కొత్తగా 888 కుటుంబాలకు ప్రభుత్వం రేషన్ కార్డులను మంజూరు చేసింది. ఈ మేరకు చాలా మందికి లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే కార్డు ఉండి అందులో పిల్లల పేర్లు లేకుండా చాలా మంది ఉన్నారు. ఇందులో కొత్తగా 1,900 మందిని వారి పాత కార్డుల్లో చేర్చారు. వీరందరికీ ఈనెల నుంచి బియ్యాన్ని అందించాల్సి ఉండగా అదనంగా 12 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం పడుతుంది. జిల్లా వ్యాప్తంగా పెండింగ్ ఉన్న దరఖాస్తుల్లోనూ అర్హులను గుర్తిస్తే ఈ కోటా మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది.
లబ్ధిదారుల్లో సంతోషం
ఎన్నో ఏళ్లుగా నిలిచిన రేషన్ కార్డుల ప్రక్రియ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ముందుకు కదలడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలన్నింటికీ రేషన్ కార్డే ప్రామాణికం కావడంతో జిల్లాలో కార్డులేని వారు దశాబ్ద కాలంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు కాక, ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రుణాలు పొందలేక ఎన్నో అవస్థలు పడ్డారు. ఈ క్రమంలో జిల్లాకు కొత్తగా 888 మందికి కొత్త కార్డులు రావడంతో తమకు కూడా ప్రభుత్వ పథకాలు వస్తాయనే నమ్మకం అర్హులైన దరఖాస్తుదారుల్లో ఏర్పడింది.
888 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు
పాత కార్డుల్లో చేర్పులతో పెరిగిన లబ్ధిదారులు
ప్రతీనెల 12 మెట్రిక్ టన్నుల బియ్యం అదనం
నేటికీ కొనసాగుతున్న దరఖాస్తుల పరిశీలన
లబ్ధిదారుల్లో సంతోషం
జిల్లాలో రేషన్ వివరాలు :
రేషన్ దుకాణాలు 684
రేషన్ కార్డులు 2,92,131
అంత్యోదయ కార్డులు 18341
మొత్తం లబ్ధిదారులు 8,95,467
అన్నపూర్ణ కార్డులు 82
నెలవారీగా పంపిణీ చేయాల్సిన బియ్యం
5,720 మెట్రిక్ టన్నులు

పెరిగిన బియ్యం కోటా

పెరిగిన బియ్యం కోటా
Comments
Please login to add a commentAdd a comment