
తిర‘గాలి’ వేగం.. ఉత్పత్తి నిరంతరం
పెరుగుతున్న పవన విద్యుత్
● సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ప్రాజెక్టులు ● రూ.500 కోట్ల వ్యయంతో ఏర్పాటు ● మరికొద్ది రోజుల్లో అదనపు విండ్ టవర్లు
● ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు రాష్ట్రాల్లో పవన విద్యుత్, తెలంగాణ రాష్ట్రంలో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ ద్వారా పవన విద్యుత్ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తున్నారు.
● రాష్ట్రంలో సంగారెడ్డి, వికారాబాద్‌తోపాటు పలు జిల్లాలోని ప్రాంతాల్లో పవన విద్యుద్దుత్పత్తికి అనుకూలమని జాతీయ పవన విద్యుద్దుత్పత్తి సంస్థ సర్వే వెల్లడించింది.
● సంగారెడ్డి జిల్లాతోపాటు వికారాబాద్ జిల్లాలో 100 మెగావాట్ల విద్యుద్దుత్పత్తి సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులను నెలకొల్పారు. ఆయా జిల్లాల్లో కొన్నేళ్లుగా విద్యుద్దుత్పత్తి కొనసాగుతుంది.
● సోలార్ విద్యుద్దుత్పత్తి కేవలం ఎండ ఉన్న సమయాల్లోనే జరుగగా పవన విద్యుత్ మాత్రం వీచే గాలిని బట్టి 24 గంటలూ జరుగుతుంది.
సంగారెడ్డి జోన్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో కొత్త కొత్త టెక్నాలజీని వినియోగించుకుని విద్యుద్దుత్పత్తి చేపడుతున్నారు. రోజురోజుకీ విద్యుత్ వినియోగం పెరుగుతోంది. పరిశ్రమలతోపాటు గృహాల్లోనూ విద్యుత్ అవసరాలు ఎక్కువయ్యాయి. విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి.
11,730 మెగావాట్ల విద్యుద్దుత్పత్తి
ఝరాసంగం మండలంలో ఏర్పాటు చేసిన పవన విద్యుత్ ప్రాజెక్టు ద్వారా ప్రారంభం నుంచి ఇప్పటివరకు 11,730 మెగావాట్ల విద్యుద్దుత్పత్తి జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. ఒక రోజులో సుమారు 25 నుంచి 27 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. సంవత్సరంలో జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో గాలులుగా ఎక్కువగా వీయడంతో విద్యుద్దుత్పత్తి ఎక్కువగా ఉంటుంది. ప్రతీ ఆరు నెలలకొకసారి టర్బైన్ టవర్ల నిర్వహణ చేపడుతారు.
రూ.500 కోట్ల పెట్టుబడితో ప్రాజెక్టు
హీరో ఫ్యూచర్ పవన విద్యుత్ ప్రాజెక్టు సుమారు రూ.500 కోట్ల పెట్టుబడితో నెలకొల్పారు. ఇప్పటివరకు 13 టర్బైన్ టవర్లను ఏర్పాటు చేయగా మరికొన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఒక్కో టర్బైన్ టవర్ సుమారు రూ. 20 కోట్ల వ్యయంతో నిర్మాణం కానుంది.
వికారాబాద్ జిల్లాలో
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో 48 టర్బైన్ టవర్లతో 100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పవన విద్యుద్దుత్పత్తి ప్రాజెక్టును ఏర్పాటు చేశారు.
నిమ్జ్ ఏర్పాటు నేపథ్యంలో
జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం, న్యాల్‌కల్ మండలాల్లో నిమ్జ్ (జాతీయ పారిశ్రామిక ఉత్పత్తి మండలి) 12,635 ఎకరాల్లో ఏర్పాటు కానుంది. నిమ్జ్‌లో ఏర్పాటు అయ్యే పరిశ్రమలకు అవసరమయ్యే విద్యుత్‌ను సరఫరా చేయనున్నారు.
సంగారెడ్డి జిల్లాలో హీరో ఫ్యూచర్స్ ప్రాజెక్టు
జిల్లాలోని ఝరాసంగం మండల పరిధిలోని చీలపల్లి, చీలపల్లి తండా, బర్దిపూర్, ఎల్గోయి గ్రామ శివారులో అనువైన స్థలాలను గుర్తించారు. హీరో ఫ్యూచర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 100 మీటర్ల ఎత్తులో 13 పవర్ జనరేటింగ్ టర్బైన్ టవర్స్‌తో కూడిన విద్యుద్దుత్పత్తి ప్రాజెక్టును నెలకొల్పారు. ఒక్కో టర్బైన్ టవర్ వీచే గాలి సామర్థ్యాన్ని బట్టి ఒక రోజులో 2.1 మెగావాట్ల విద్యుద్దుత్పత్తి జరుగుతుంది. 100 మెగావాట్ల విద్యుద్దుత్పత్తి సామర్థ్యం గల ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రోజుకి 25 నుంచి 27 మెగావాట్ల విద్యుద్దుత్పత్తి జరుగుతుంది. ఝరాసంగం మండలం పరిధిలోని కుప్పానగర్– మాచ్నూర్ గ్రామాల శివారులో ప్రత్యేకంగా సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను సబ్ స్టేషన్‌కు సరఫరా చేసి అక్కడి నుంచి జహీరాబాద్ శివారులోని కాశీంపూర్ ప్రభుత్వ సబ్‌స్టేషన్‌కు తరలిస్తారు. ఇక్కడి నుంచి అవసరాల మేరకు ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు.

తిర‘గాలి’ వేగం.. ఉత్పత్తి నిరంతరం
Comments
Please login to add a commentAdd a comment