ఆస్తి కోసం కన్నతల్లిని కడతేర్చిన కొడుకు
● మద్యం మత్తులో కత్తితో దాడి ● మృతురాలి శరీరంపై ఆరు కత్తిపోట్లు ● సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఘటన
రామచంద్రాపురం(పటాన్‌చెరు): ఆస్తి కోసం కన్నతల్లినే కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. మద్యం మత్తులో కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని డివినో విలాస్స్‌లో నివాసముండే నవారి రాధిక(52), భర్త మాల్లారెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సందీప్ రెడ్డికి గతేడాది వివాహం జరిగింది. రెండో కుమారుడు కార్తీక్ రెడ్డి మద్యానికి బానిసయ్యాడు. కొంత కాలంగా తనకు రావాల్సిన ఆస్తిని పంచితే తాను వ్యాపారం చేసుకుంటానని నిత్యం తల్లిదండ్రులతో గొడవ పడేవాడు. మద్యానికి బానిస కావడంతో కార్తీక్ రెడ్డిని గతేడాది రెండు సార్లు రియబ్‌టేషన్ సెంటర్‌కు పంపించారు. జనవరి నెలలో తిరిగి ఇంటికొచ్చాడు. మళ్లీ ఆస్తి విషయంపై గొడవపడుతూ వస్తున్నాడు. కార్తీక్ రెడ్డి ఆదివారం రాత్రి మద్యం సేవించి ఇంటికొచ్చాడు. సోమవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఇంట్లో తనకు ఆస్తి పంచాలని పెద్దపెద్దగా అరవడం మొదలుపెట్టాడు. తల్లి రాధిక నిద్రలేచి ఏమైందంటూ అనడంతో ఆమైపె కత్తితో దాడి చేశాడు. తండ్రి మల్లారెడ్డి అడ్డుకునేందుకు ప్రయత్నించగా అతడిపై దాడి చేశాడు. వెంటనే అతడు బయటకు పరిగెత్తి కాపాడాలంటూ గట్టిగా కేకలేశాడు. సందీప్ రెడ్డి సైతం భయంతో బయటకు వచ్చి తల్లిని కాపాడాలంటూ కేకలేశాడు. అందరూ కలిసి లోనికి వెళ్లి చూడగా రాధిక రక్తం మడుగులో పడి ఉంది. వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయం 10 గంటల సమయంలో మృతి చెందింది. సమాచారం అందుకున్న కొల్లూరు ఎస్‌ఐ రవీందర్, మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతురాలి శరీరంపై ఆరు కత్తిపోట్లు ఉన్నట్లు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు కార్తీక్ రెడ్డిని సోమవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆస్తి కోసం కన్నతల్లిని కడతేర్చిన కొడుకు
Comments
Please login to add a commentAdd a comment