పిల్లలకు వినికిడి పరీక్షలు నిర్వహించాలి
సిద్దిపేట ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శాంతి
సిద్దిపేటకమాన్: మూడేళ్ల వరకు ఉన్న చిన్న పిల్లలకు తప్పకుండా వినికిడి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శాంతి, ఈఎన్‌టీ విభాగ హెచ్‌ఓడీ కే.నాగరాజు తెలిపారు. జాతీయ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సోమవారం ఈఎన్‌టీ విభాగ వైద్యుడు డాక్టర్ కడవేర్గు ప్రణీత్‌తో కలిసి డాక్టర్ శాంతి, డాక్టర్ నాగరాజు మాట్లాడారు. ప్రభుత్వాస్పత్రిలో డెలివరీ అయిన బాలింతలకు, పిల్లల తల్లిదండ్రులకు వినికిడి సమస్యలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. ప్రతీ బేబీకి డిశ్చార్జీకి ముందు తప్పకుండా ఈఎన్‌టీ విభాగ వైద్యులతో వినికిడి పరీక్షలు నిర్వహించాలన్నారు. పిల్లలకు వినికిడి సమస్య ఉంటే భవిష్యత్‌లో వారికి మాటలు కూడా సరిగా రాకపోవడానికి అవకాశం ఉంటుందన్నారు. నెలలు నిండకుండా, బరువు తక్కువగా జన్మించిన పిల్లలకు తప్పకుండా వినికిడి పరీక్షలు చేయించి, ఏదైనా సమస్య ఉంటే చికిత్స తీసుకోవాలని తెలిపారు. ఫ్లకార్డులతో వైద్యులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ చందర్, ఆర్‌ఎంలు డాక్టర్ జ్యోతి, డాక్టర్ శ్రావణి, డాక్టర్ మాధవి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment