సర్వం సిద్ధం
● రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ● సీసీ కెమెరాల పర్యవేక్షణలో.. ● ఉదయం 9 నుంచి 12 గంటల వరకు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఈనెల 5 నుంచి 25వ తేదీ వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహిస్తామని జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి గోవింద్‌రాం తెలిపారు. సంగారెడ్డిలోని కలెక్టరేట్‌లో సోమవారం ఆయన పరీక్షలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా విద్యుత్, రవాణా, వైద్య అధికారులతో సమీక్షించామని తెలిపారు.
జిల్లాలో 54 పరీక్ష కేంద్రాలు
జిల్లాలో 54 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 34,614 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరం 16,513. ద్వితీయ సంవత్సరం 18,101 మంది విద్యార్థులు ఉన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు హాల్‌టికెట్ ఇవ్వకుంటే tgbie.cgg.gov.in అనే వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, హాల్ టికెట్‌పై సంబంధిత ప్రిన్సిపాల్ సంతకం లేకున్నా పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారని తెలిపారు.
నిమిషం నిబంధన లేదు, కానీ..
గతంలో ఉన్న నిమిషం నిబంధన ఎత్తివేసినప్పటికీ ప్రస్తుతం ప్రతి విద్యార్థి 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. పరీక్ష కేంద్రాన్ని తెలుసుకోవడానికి ఇబ్బందులు ఉంటే హాల్ టికెట్ వెనుక క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే సెంటర్ లొకేషన్ చూపిస్తుంది. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ప్రతి పరీక్ష కేంద్రాలకు సమీపంలో జిరాక్స్ కేంద్రాలను మూసి ఉంచాలని ఆదేశించారు. విద్యార్థులు తమ వెంట ఎటువంటి చేతి వాచీలు, ఎలక్ట్రిక్ పరికరాలను అనుమతించేది లేదని ఇంటర్మీడియెట్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఏర్పాట్లు పూర్తి చేశాం
విద్యార్థులు పరీక్షలు ప్రశాంతంగా రాసేలా జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రతి పరీక్ష కేంద్రంలోనూ సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే ప్రశ్నపత్రాన్ని ఓపెన్ చేస్తాం. ప్రతి సీసీ కెమెరా కూడా ఇంటర్మీడియెట్ రాష్ట్ర శాఖకు అనుసంధానంగా ఉంటుంది. 8:45 గంటలు దాటితే పరీక్ష కేంద్రంలోకి అనుమతించం.
: గోవింద్‌రాం, ఇంటర్మీడియెట్ అధికారి
పరీక్ష కేంద్రాలు 54
ప్రథమ సంవత్సరం
విద్యార్థులు 16,513
ద్వితీయ సంవత్సరం
విద్యార్థులు 18,101
స్టోరేజీ పాయింట్లు 19
ఇన్విజిలేటర్లు 926
డీఈఓ మెంబర్‌లు 03
ప్రశ్నపత్రం బల్క్
ఇన్‌చార్జి 01
సీఎస్‌లు 54
డీఎస్‌లు 54
ప్లయింగ్ స్క్వాడ్ 03 బృందాలు
సిట్టింగ్ స్క్వాడ్ 04 బృందాలు
వివరాలు..
Comments
Please login to add a commentAdd a comment