భావి శాస్త్రవేత్తలుగా తయారు కావాలి
● శాస్త్రవేత్త డాక్టర్ రఘు వర్మ
న్యాల్‌కల్(జహీరాబాద్): విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా తయారు కావాలని ఎన్‌ఆర్‌ఎస్‌సీ (నేషనల్ రిమోట్ సెన్‌సింగ్ సెంటర్) రిటైడ్ జూనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రఘు వర్మ సూచించారు. సోమవారం మండల పరిధిలోని మిర్జాపూర్(బి)లోని జెడ్పీహెచ్‌ఎస్‌లో రాకెట్ సైన్స్, టెక్నాలజీపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రఘు వర్మ మాట్లాడుతూ.. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు. విద్యార్థులు చేసే కృషికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఇస్రో చేసిన సేవలను గుర్తు చేస్తూ చంద్రయాన్–3 సాధించిన విజయంను దృశ్య రూపంలో విద్యార్థులకు చూపించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం రాజ్‌కుమార్‌తోపాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రహదారుల
మరమ్మతులు చేపట్టాలి
● మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
నారాయణఖేడ్: ఖేడ్ పట్టణంతోపాటు సంబంధిత రూట్లలో ఎన్‌హెచ్ 161బీ జాతీయ రహదారి మరమ్మతులు చేయకుంటే ఆందోళన చేపడుతామని మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగా నిజాంపేట్–ఖేడ్– బీదర్ జాతీయ రహదారికి రూ.353 కోట్లు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. ఈ నిధులతోనే ఖేడ్ పట్టణంతోపాటు అనుబంధ రోడ్లను కాంట్రాక్టర్ మరమ్మతులు చేయాల్సి ఉన్నా, పనుల్లో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. అధ్వానంగా మారిన రహదారులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. వెంటనే మర్మతులు చేపట్టాలని. లేని పక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో మాజీ జెడ్పీటీసీ నర్సింహ్మా రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పరశురాం, మాజీ కౌన్సిలర్లు అభిషేక్ షెట్కార్, విఠల్, నగేశ్, ముజామ్మిల్, అంజాగౌడ్, సంగప్ప, మల్గొండ, మశ్చందర్ పాల్గొన్నారు.
కనీస వేతనం
రూ. 26వేలు ఇవ్వాలి
● సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు
చుక్కా రాములు
పటాన్‌చెరు టౌన్/సంగారెడ్డి ఎడ్యుకేషన్: కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు పెంచాలని డిమాండ్ చేస్తూ త్వరలో ఉద్యమం చేయబోతున్నట్లు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు, కిర్బీ యూనియన్ అధ్యక్షుడు చుక్క రాములు అన్నారు. సోమవారం కిర్బీ కార్మికుల సమావేశంలో, అలాగే.. సంగారెడ్డి కలెక్టరేట్‌లో డిప్యూటీ లేబర్ కమీషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కనీస వేతనాలు పెంచలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెంచకుండా మీనమేషాలు లెక్కిస్తుందని ఆరోపించారు. పెట్టుబడుదారులకు అనుకూలంగా మాత్రమే పాలకుల నిర్ణయాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఈ నెలలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
కేతకి ఆదాయం
రూ.11.10 లక్షలు
ఝరాసంగం(జహీరాబాద్): మహాశివరాత్రి పురస్కరించుకొని శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయ ఆదాయాన్ని లెక్కించారు. సోమవారం ఆలయ ఆవరణలో శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, లెక్కింపు ప్రారంభించారు. 13 రోజులలో రూ.11 లక్షల 70 వేల 698 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శివరుద్రప్ప, నాయకులు చంద్రశేఖర్, మల్లయ్య స్వామి, సంగారెడ్డి, ఆలయ అర్చకులు, అధికారులు, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
భావి శాస్త్రవేత్తలుగా తయారు కావాలి
Comments
Please login to add a commentAdd a comment