బాబోయ్.. భగీరథ
● రంగు మారిన తాగునీరు ● కలుషిత నీటి సరఫరాతో జనం బెంబేలు
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): మిషన్ భగీరథ కింద కలుషిత నీరు సరఫరా అవుతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సదాశివపేట పట్టణం, మండల పరిధిలో వారం రోజులుగా ఈ పరిస్థితి నెలకొంది. మునిపల్లి మండలం బూసరెడ్డిపేట వాటర్ ప్లాంట్ నుంచి ఈ గ్రామాలకు మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తారు. సదాశివపేట సహా మండల పరిధిలోని 20 గ్రామాలకు కలుషిత నీరు సరఫరా అవుతోంది. నల్లాల్లో పచ్చని, ఎర్రటి రంగుల్లో తాగునీరు సరఫరా అవుతుండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. బిందెలు, బకెట్ అడుగున ఎర్రటి బురద పేరుకుపోతుంది. కలుషిత నీరు తాగితే ఎలాంటి వ్యాధులు సోకుతాయోనని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కలుషిత నీరు సరఫరా కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయమై వివరణ కోరేందుకు మిషన్ భగీరథ ఏఈని పలుమార్లు ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment