● సామాజిక తనిఖీ బృందంపరిశీలనలో వెలుగులోకి.. ● ఆరుగురు ఫీల్డ్ అసిస్టెంట్లకు జరిమాన
హత్నూర (సంగారెడ్డి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను సామాజిక తనిఖీ బృందం పరిశీలించింది. పనుల్లో అనేక అవకతవకలు జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. సోమవారం హత్నూర రైతువేదికలో బహిరంగ విచారణ చేపట్టారు. 2023–24 సంవత్సరంలో మండలంలోని ఆయా గ్రామ పంచాయతీలలో చేపట్టిన ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులపై వారం రోజులుగా క్షేత్రస్థాయి విచారణ చేపట్టింది. అక్కడ సోషల్ ఆడిట్ బృందం గుర్తించిన లోటుపాట్లు, అక్రమాలను బహిరంగ ప్రజావేదిక దృష్టికి తీసుకొచ్చింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మొక్కల పెంపకం లోపభూయిష్టంగా ఉన్నట్లు గుర్తించింది. అనేక గ్రామాలలో పెట్టిన మొక్కలు సంరక్షించడంలో ఫీల్డ్ అసిస్టెంట్లు విఫలమైనట్లు వివరించింది. అంతేకాకుండా, మెజార్టీ గ్రామాలలో మస్టర్ల నిర్వహణ సక్రమంగా లేదని పేర్కొంది. నిర్లక్ష్యంగా వ్యవహరించే ఫీల్డ్ అసిస్టెంట్లపై చర్యలు తప్పవని బృందం సభ్యులు హెచ్చరించారు. ఇదిలా ఉండగా క్షేత్రస్థాయి పరిశీలన చేయడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న ఆరుగురు ఫీల్డ్ అసిస్టెంట్లకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున జరిమాన వేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొసీడింగ్ ఆఫీసర్ బాలరాజ్, డీవీవో నాగేశ్వరరావు. ఎంపీడీవో శంకర్, ఎస్‌ఆర్పీ కవిత, ఏపీవో ప్రవీణ్ కుమార్ ,గ్రామ పంచాయతీ కార్యదర్శులు ,ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment