సంగారెడ్డి జోన్: పెండింగ్‌లో ఉన్న కేసులలో ఇరువర్గాలు రాజీపడేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్‌హెచ్‌ఓలకు ఎస్పీ చెన్నూరి రూపేష్ ఆదేశించారు. సోమవారం పోలీసు కార్యాలయం నుంచి జిల్లాలోని వివిధ పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కానిస్టేబుల్ నుంచి అధికారుల వరకు వీలైనన్ని ఎక్కువ కేసులు రాజీ పడేలా చూడాలన్నారు. ఈ నెల 8వ తేదీన లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని చెప్పారు. సైబర్ నేరాలకు సంబంధించి బాధితులు కోల్పోయిన/ హోల్డ్ చేయబడిన డబ్బు తిరిగి బాధితులకు చేరే విధంగా సంబంధిత బ్యాంక్ అధికారులకు కోర్టు ద్వారా ఉత్తర్వులు అందించాలని సూచించారు. ఇ–పెట్టి కేసులు, మద్యం తాగి పట్టుబడిన కేసులలో విధించిన జరిమానా డబ్బులు చెల్లించే విధంగా చూడాలని అన్నారు. క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్–అదాలత్ అనేది ఒక మంచి అవకాశమని, అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని సూచించారు. అదనపు ఎస్పీ ఎ.సంజీవ రావ్, సైబర్ క్రైమ్ డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి, డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ రమేష్, కంట్రోల్ రూమ్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ రెడ్డి, కోర్టు లైజనింగ్ అధికారి సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
ఎస్పీ చెన్నూరి రూపేశ్
Comments
Please login to add a commentAdd a comment