సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: హత్నూర మండలంలో ఓ పౌల్ట్రీ ఫామ్‌లో రోజూ వందల్లో కోళ్లు మృత్యువాత పడ్డాయి. చనిపోయిన కోళ్ల నమూనాలను సేకరించేందుకు పశుసంవర్థకశాఖ అధికారులు అక్కడికి వెళ్లేలోపే ఫామ్ యాజమాన్యం చనిపోయిన వాటిని గప్‌చుప్‌గా పూడ్చేసి.. ఫామ్ మొత్తాన్ని శుభ్రం చేసి పెట్టేశారు. దీంతో శాంపిళ్లు సేకరించకుండానే అధికారులు వెనుదిరగాల్సి వచ్చింది. ఇలా జిల్లాలో పలుచోట్ల ఉన్న ఫారాల్లో కోళ్లు మృత్యువాత పడుతుంటే తమకు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని పశుసంవర్థకశాఖ అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ వ్యాపించకుండా ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. పశుసంవర్థకశాఖ అధికారులు తమ విధుల్లో భాగంగా వివిధ కోళ్ల ఫారాలను పరిశీలించేందుకు వెళ్తుంటారు. అయితే ఆ అధికారులు, సిబ్బంది తమ ఫారాలకు వస్తే ఏదైనా వైరస్ అంటుకుంటుందనే భయంతో అధికారులకు సమాచారం ఇవ్వడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అసాధారణ మరణాలుంటే....
కోళ్ల ఫారాల్లో అసాధారణ స్థాయిలో కోళ్ల మరణాలుంటే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. అయితే జిల్లాలో పలు కోళ్ల ఫారాలను ఆయా పౌల్ట్రీ కంపెనీలే ఎక్కువగా లీజుకు తీసుకున్నాయి. ఆయా కంపెనీలే కోడి పిల్లలను సరఫరా చేస్తున్నాయి. వాటికి అవసరమైన దాణా, మందులు సరఫరా చేస్తున్నాయి. వాటి పెరుగుదలపై ఆయా కంపెనీల ప్రతినిధులే పర్యవేక్షిస్తున్నారు. ఇలా కోళ్లను పెంచినందుకుగాను రైతుకు నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తున్నాయి. అయితే కోళ్లు చనిపోయినప్పుడు రైతులు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనల మేరకే నడుచుకుంటున్నారని పశుసంవర్థకశాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, చౌటకూర్ మండలం బొమ్మారెడ్డిగూడెం గ్రామంలోని కోళ్ల ఫారంలోనూ వందల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. అక్కడికి వెళ్లిన అధికారులు శాంపిళ్లను సేకరించి వీబీఆర్‌ఐ (వెటర్నరీ బయలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్)కి పంపారు.
వ్యాపించకుండా ముందుజాగ్రత్త చర్యలు..
మండలానికి ఒకటి చొప్పున పశుసంవర్థశాఖ అధికారులు రెస్క్యూ టీంలను నియమించారు. సరిహద్దుల్లో కర్ణాటక, మహారాష్ట్రలనుంచి కోళ్లు తెలంగాణకు రాకుండా సరిహద్దుల్లో చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు కూడా చేస్తున్నారు. మరోవైపు జిల్లాలో ఉన్న కోళ్ల ఫారాల యజమానులకు అవగాహన కూడా కల్పించారు. అసాధారణ స్థాయిలో మరణాలుంటే సమాచారం ఇవ్వాలని సూచించారు. కానీ చాలావరకు ఈ సమాచారం అధికారులకు చేరడం లేదు.
కోళ్ల ఫారాన్ని పరిశీలిస్తున్న అధికారులు. చనిపోయిన కోళ్లను పూడ్చిపెడుతున్న దృశ్యం (ఫైల్)
సమాచారం ఇవ్వడం లేదంటున్న అధికారులు
చనిపోయిన వాటి నమూనాల సేకరణలో ఇబ్బందులు
కచ్చితంగా సమాచారం ఇవ్వాలి
నాలుగైదు శాతం కోళ్లు మరణించడం సాధారణమే. కానీ, పది నుంచి 20 శాతం కోళ్లు ఒక్కసారిగా మరణిస్తే తప్పకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అసాధారణ మరణాలుంటే తమకు సమాచారం ఇవ్వాలని కోరినప్పటికీ కొన్ని ఫారాల యాజమాన్యాలు సమాచారం ఇవ్వడం లేదు.
–డాక్టర్.హేమలత,
పశుసంవర్థకశాఖ, హత్నూర మండలం
Comments
Please login to add a commentAdd a comment