
కుటుంబాన్నే మట్టుబెట్టలనే..
రామచంద్రాపురం(పటాన్‌చెరు): ఆస్తి కోసం కన్న తల్లినే కిరాతకంగా హత్య చేసి అమ్మబంధాన్నే ప్రశ్నార్థకం చేశాడో తనయుడు. ఆస్తి పంచివ్వడంలేదని కక్ష పెంచుకుని కుటుంబ సభ్యులనే హతమార్చేందుకు కుట్రపన్నాడు సదరు ప్రబుద్ధుడు. డబ్బు వ్యామోహం, మాదక ద్రవ్యాల మత్తులో విచక్షణ సైతం కోల్పోయి కొడుకు బంధానికే మచ్చతెచ్చాడు కార్తీక్‌రెడ్డి. ఈ కేసును పోలీసులు 12 గంటల్లో ఛేదించారు. తల్లిని హత్య చేసిన కార్తీక్‌రెడ్డిని పోలీసులు సోమవారం సాయంత్రం అదుపులోకి తీసుకొని విచారించగా పలు విషయాలు వెల్లడయ్యాయి. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్తీక్‌రెడ్డి ఏడాదిన్నర కాలంగా తనకు రావాల్సిన ఆస్తి ఇవ్వాలని వ్యాపారం చేసుకుంటానని కుటుంబ సభ్యులతో నిత్యం గొడవపడుతుండేవాడు. మద్యానికి బానిసైన కార్తీక్‌రెడ్డి గోవా వెళ్లిన సమయంలో డ్రగ్స్ తీసుకునేవాడు. కుటుంబ సభ్యులు ఆస్తిని పంచడం లేదని వారిపై కక్ష పెంచుకున్నాడు. నెల రోజుల కిందట ఆన్‌లైన్‌లో 5 కత్తులను కొనుగోలు చేసి తన గదిలో భద్రపరుచుకున్నాడు. కొద్దిరోజులకు తనకు రావాల్సిన ఆస్తిను ఇవ్వాలని కుటుంబ సభ్యులను కత్తితో బెదిరించాడు. ఆ సమయంలో పెద్దలతో పంచాయితీ పెట్టి నచ్చజెప్పారు. అప్పటి నుంచి కార్తీక్‌రెడ్డి అదును కోసం వేచి చూస్తూ ఉన్నాడు. ఆదివారం రాత్రి శేరిలింగంపల్లి గోపనపల్లిలో నివాసం ఉండే స్నేహితుడికి ఫోన్ చేసి మద్యం తాగుదామని పిలిచాడు. స్నేహితుడితో కలిసి బీర్‌లు తీసుకొని తెల్లాపూర్‌లోని జీబ్లాక్ వద్దకు వెళ్లి మద్యం సేవించారు. ఆ సమయంలో తనకు త్వరలో డబ్బులు వస్తున్నాయని ఏ వ్యాపారం చేస్తే బాగుటుందని స్నేహితుడిని సలహా అడిగాడు. హాస్టల్ వ్యాపారం బాగుంటుందని సలహా ఇచ్చాడు. అదే సమయంలో అతడి స్నేహితుడికి ఫోన్ రావడంతో వెళ్లిపోయాడు. మిగిలిన బీర్‌లను తీసుకుని కార్తీక్‌రెడ్డి ఇంటికి వెళ్లిపోయాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న బీర్‌లతోపాటు ఇంట్లో తండ్రి తెచ్చుకుని పెట్టుకున్న మద్యం సైతం తాగాడు. తల్లి రాధిక, తండ్రి మల్లారెడ్డి కింద హాల్ పడుకోగా, కార్తీక్‌రెడ్డి తన గదిలోకి వెళ్లాడు. అన్న సందీప్ రెడ్డి దంపతులు మొదటి అంతస్తులో పడుకున్నారు. తెల్లవారుజాము 4.30గంటల సమయంలో తల్లి రాధిక నిద్ర నుంచి లేచి సోఫాలో కూర్చుంది. గదిలో నుంచి బయటకు వచ్చిన కార్తీక్‌రెడ్డి తల్లిపై కత్తితో దాడి చేశాడు. అది చూసిన తండ్రి మల్లారెడ్డి కత్తిని గుంజుకునే ప్రయత్నం చేయగా అతడిపై కూడా దాడి చేశాడు. కొడుకు చేతులోని కత్తిని గుంజుకుని మల్లారెడ్డి సెక్యూరిటీ వద్దకు పరుగులు తీశాడు. అదే సమయంలో గదిలో దాచుకున్న మరో కత్తిని తీసుకొని వచ్చి దాడి చేయబోయాడు. కత్తి పోట్లకు గురైన రాధిక ఇంట్లో నుంచి బయటకు వచ్చి రోడ్డుపై పడిపోయింది. బయటకు వచ్చిన కార్తీక్‌రెడ్డి అమ్మను ఆసుపత్రి తీసుకొని పోదాం రమ్మంటూ కేకలు వేశాడు. అక్కడికి తండ్రి వస్తే అతడిపై కూడా దాడి చేయడానికి సిద్ధం కావడంతో తండ్రి రాలేదు. పై గదిలో నుంచి కిందకు వచ్చిన అన్న వదినలు ఇది పద్ధతి కాదంటూ చెప్పడంతో వదిన మీరు మధ్యలోకి రావొద్దు ఇది మా సమస్య అంటూ బెదిరించాడు. భయంతో సందీప్‌రెడ్డి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. అక్కడి నుంచి కార్తీక్‌రెడ్డి పరారయ్యాడు. సోమవారం సాయంత్రం తెల్లాపూర్ మేళ్ల చెరువు వద్ద ఉన్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. పోలీసులు నిందితుడి వద్ద నుంచి 5 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం కార్తీక్‌రెడ్డిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
ఆస్తి ఇవ్వడంలేదని కుటుంబ సభ్యులపై కక్ష పెంచుకున్న కార్తీక్‌రెడ్డి
ఆన్‌లైన్‌లో ఐదు కత్తులు కొనుగోలు
హత్య కేసును 12 గంటలలో ఛేదించిన కొల్లూరు పోలీసులు
నిందితుడిని రిమాండ్‌కు తరలింపు
Comments
Please login to add a commentAdd a comment