
‘సృజన’ రాష్ట్రస్థాయి పోటీలకు రెండు ప్రాజెక్టులు
జహీరాబాద్: జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం నిర్వహించిన సృజన జిల్లా స్థాయి ‘టెక్ ఫెస్ట్’లో రెండు ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాయి. జిల్లాలోని జహీరాబాద్, చేగుంట, జోగిపేట, గజ్వేల్, నర్సాపూర్‌లలోని పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన విద్యార్థులకు ఆటోమొబైల్ అంశంపై టెక్ ఫెస్ట్ నిర్వహించారు. ప్రతీ కళాశాల నుంచి ఒక్కో అంశాన్ని ఎంపిక చేసి ప్రదర్శించారు. చేగుంట కళాశాలకు చెందిన విద్యార్థులు సోలార్ పవర్డ్–స్మార్ట్ బ్లూటూత్ ఆపరేటెడ్ మల్టీ పర్పస్ అగ్రికల్చర్ యంత్రాన్ని ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు ప్రథమ బహుమతి లభించింది. దీన్ని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. సోలార్‌తో నడుస్తూ దున్నడం, విత్తనాలు వేయడం, భూమిని చదును చేయడంతోపాటు రసాయన మందులను పిచికారీ చేయడం వంటి పనులను ఏకకాలంలో చేసే విధంగా రూపొందించారు. ఈ యంత్రంతో ఏ పని అవసరముంటే దాన్ని చేసుకునే విధంగా తయారు చేశారు. పూర్తిగా సౌరశక్తితో పనిచేసే ఈ యంత్రం వర్షాకాలంలో బ్యాటరీ సహాయంతో కూడా నడిచే విధంగా రూపొందించారు. దీంతో ఎలాంటి కాలుష్యం వెలువడదు. గైడ్ శోభ పర్యవేక్షణలో విద్యార్థులు ఎం.డి.ఫౌజన్, మనోజ్‌వర్ధన్, తాత్విక్, హేమంత్, నిఖిల్‌లు ప్రాజెక్టును రూపొందించారు.
ఫైర్ ఫైటర్ రోబోట్...
అగ్నిప్రమాదంలో మంటలు అదుపుచేసేందుకు వీలుగా రిమోట్ సహాయంతో పనిచేసే ఫైర్ ఇంజన్‌ను గజ్వేల్‌లోని జీఎంఆర్‌పీ కళాశాలకు చెందిన విద్యార్థులు రూపొందించిన ప్రదర్శించారు. ఈ ప్రాజెక్టుకు ద్వితీయ బహుమతి లభించింది. ఈ ప్రాజెక్టును కూడా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. మనిషి అవసరం లేకుండానే రిమోట్ సహాయంతో 360 డిగ్రీ ఫైర్ ఫైటర్ రోబో వాహనాన్ని దట్టమైన పొగలోకి పంపించి నీటిద్వారా అగ్నికీలల్ని అదుపు చేస్తుంది. దీపికారెడ్డి, నళిని గైడ్‌గా వ్యవహరించిన ఈ ప్రాజెక్టును విద్యార్థులు సూర్యప్రకాష్, అనిల్, అవినాష్, సంజయ్, నాగరాజు, జగదీష్ రూపొందించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సువర్ణలతతోపాటు జీవీ రమేశ్‌కుమార్, చైతన్య, నర్సింహకుమార్, మధుకిరణ్, రాంరెడ్డిలు పాల్గొన్నారు.
జిల్లా స్థాయి పోటీల్లోఐదు ప్రాజెక్టులు ప్రదర్శన
మల్టీపర్పస్ అగ్రికల్చర్ మెషీన్‌కు ప్రథమ బహుమతి
ఫైర్ ఫైటర్ రోబోట్‌కు ద్వితీయ బహుమతి
Comments
Please login to add a commentAdd a comment