ఉపాధిహామీ.. సౌకర్యాలు లేవేమి
కంది(సంగారెడ్డి): వలసలను నివారించేందుకు ఏర్పాటైన ఉపాధి హామీపథకంలో పని చేస్తున్న కూలీలకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఉపాధి హామీ చట్టం ప్రకారం పని ప్రదేశంలో కూలీలకు నిలువనీడ కల్పించడంతోపాటు తాగు నీరు, ప్రథమ చికిత్స కిట్లు అందజేయాల్సి ఉన్నా అవి అమలుకు నోచు కోవడంలేదు. దీంతో కూలీలు ఎండలో అవస్థలు పడుతున్నారు. వేసవిలో కూలీలకు పని ప్రదేశంలో సేద తీరేందుకు నీడ కల్పించాల్సి ఉండగా, ఏ గ్రామంలోనూ ఈ ఏర్పాట్లు చేయడం లేదు. దీంతో అక్కడక్కడా ఉన్న చెట్ల కిందే కూలీలు సేద తీరుతున్నారు. చెట్లు లేనిచోట ఎండలోనే కూర్చుని సేద తీర్చుకుంటున్నారు. ఇక పని ప్రదేశాల్లో కూలీలు గాయపడితే వారికి ప్రథమచికిత్స చేసేందుకు మెడికల్ కిట్లను గతంలో అందుబాటులో ఉంచే వారు. ప్రస్తుతం వాటి జాడ కూడా లేదు. ఉపాధి హామీ పథకంలో ప్రస్తుతం రైతుల పొలాల్లో పాండ్లు, కందకాల తవ్వకాలు కొనసాగుతున్నాయి. మండలంలోని 22 గ్రామ పంచాయతీల్లో సుమారు మూడు వేల మంది ఉపాధి కూలీలున్నారు. చాలా రోజుల నుంచి పనిముట్లు కూడ ఇవ్వడం లేదని కూలీలు చెబుతున్నారు. అధికారులు స్పందించి ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని కూలీలు విజ్ఞప్తి చేస్తున్నారు.
పంచాయతీలే సమకూర్చాలి
కూలీలకు పని ప్రదేశాల్లో నీడ, తాగునీరు అందించడం వంటి సౌకర్యాలను గ్రామపంచాయతీలే కల్పించాలి. గతమూడేళ్ల నుంచి పనిముట్లు రాలేదు. కూలీలకు పనిముట్ల డబ్బులు అదనంగా వస్తాయి. గ్రామపంచాయతీల సహకారంతో సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తాం.
–గురుపాదం, ఏపీవో, కంది.
పని ప్రదేశంలో కానరాని కనీస సౌకర్యాలు
ఎండలో ఇబ్బంది పడుతున్న కూలీలు
Comments
Please login to add a commentAdd a comment