ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలి
సంగారెడ్డి జోన్: జిల్లాలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించేలా మార్కింగ్ చేసి ఇవ్వాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఎంపీడీవోలు, ప్రత్యేక అధికారులు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం 1,36,821మంది అర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. అన్ని గ్రామ పంచాయతీల్లో ఎల్‌ఆర్‌ఎస్ డబ్బుల బ్యాలన్స్ త్వరగా వసూలు చేయాలని ఆదేశించారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని గ్రామాలలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. గ్రామీణాభివృద్ధి సంస్థ ఉపాధిహామీ పథకం ఆధ్వర్యంలో గ్రామాలలో ప్రతీరోజు కనీసం 60 మందికి కొత్త పనులు ఉపాధి కల్పించేలా పనులు చేపట్టాలని ఆదేశించారు. ఈసారి ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ మాధురి, ట్రైనీ కలెక్టర్ మనోజ్, జెడ్పీసీఈవో జానకీరెడ్డి, డీపీవో సాయిబాబా, పీడీ హౌజింగ్ చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ వల్లూరు క్రాంతి
అధికారులతో సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment