
కొత్త ఆలోచనలు.. నూతన ఆవిష్కరణలు
● పరిశోధనల వైపు అడుగులు వేస్తున్న విద్యార్థులు ● రాష్ట్ర స్థాయి జిజ్ఞాస పోటీలకు ఎంపికై న ప్రాజెక్టులు ● హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రతిభ
హుస్నాబాద్: కళాశాల స్థాయి నుంచి విద్యార్థులు పరిశోధనల వైపు అడుగులు వేస్తున్నారు. వినూత్న ఆలోచనలకు తగ్గట్లుగా కొత్త ఆవిష్కరణలకు పదును పెడుతున్నారు. కళాశాల అధ్యాపకులు విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేలా ప్రోత్సహిస్తూ, శాసీ్త్రయ ఆవిష్కరణలపై ఆసక్తిని పెంచుతున్నారు.
హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు రూపొందించిన రెండు ప్రాజెక్టులు జిజ్ఞాస స్టేట్ లెవల్ స్టడీ ప్రాజెక్టుకు ఎంపికయ్యాయి. వృక్షశాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ పర్శనేని బాలరాజు ఆధ్వర్యంలో నేత ఉత్పాదకతను పెంచడంలో జీవ ఎరువు అజోల్ల వాడకం అనే అంశం. అలాగే రాజనీతి శాస్త్ర అధ్యాపకురాలు గుగులోతు విజయ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో అనే అంశంపై చేసిన ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయి జిజ్ఞాస పోటీలకు ఎంపికయ్యాయి. నేల సారాన్ని పెంచడానికి రసాయనాల ఎరువులకు ప్రత్యామ్నాయంగా జీవ ఎరువు వాడకం పైన పరిశోధనలు చేశారు. అలాగే లింగ వివక్షతను తొలగించి ఆడపిల్లలకు ఉన్నత చదువులు అందించాలనే ఆడపిల్లల ప్రాముఖ్యతను తెలియజేస్తూ సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేస్తున్నారు.
అజోల్ల జీవ ఎరువు
వరి సాగు చేసే పంట పొలాలకు నేలను సారవంతం చేసి ఎంతో దిగుబడి పొందడానికి అజోల్ల మొక్క ఉపయోగపడుతుంది. చేపల దానగా, పౌల్ట్రీ ఫామ్‌ల్లో కోళ్లకు దానగా ఉపయోగపడుతుంది. టూ బై సిక్స్ ఫీట్ గుంతలో సారవంతమైన మట్టిని పొరగా పొందుపర్చాలి. సగం వరకు నీటితో నింపి అజోల్ల విత్తనాన్ని ప్రవేశపెట్టాలి. మూడు నుంచి నాలుగు వారాల సమయంలో అజోల్ల పెరుగుతుంది. దీనిని పచ్చిరొట్టగా పొలంలో వేసి దున్నుతారు. అజోల్ల జీవ ఎరువుగా పని చేస్తుంది. ఇక హెక్టార్ భూమిలో అజోల్లాను జీవ ఎరువుగా వాడినప్పుడు సుమారుగా 25 కేజీల నత్రజని మొక్కలకు అందుతుంది. దీంతో రసాయన ఎరువులు వాడనవసరం లేదు. పాజెక్టులో బీజెడ్‌సీ విద్యార్థులు జ్యోతి, సంగీత, అంకిత, విష్ణువర్ధన్, యామిని పాల్గొన్నారు.
ఆడపిల్లల్లో ఆత్మ స్థైర్యాన్ని పెంచాలి
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బాలికలను రక్షించడం కోసం రూపొందించిన బేటీ బచావో బేటీ పడావో సత్ఫలితాలు ఇచ్చిందని విద్యార్థులు తమ పరిశోధనల్లో తేలిందని చెబుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా సీ్త్ర విద్య పెరగడానికి తోడ్పడుతుంది. ఈ పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ 2015లో ప్రారంభించారు. లింగ వివక్షతను తొలగించి ఆడపిల్లలకు ఉన్నత విద్యను అందించాలి. గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రుల్లో, ప్రజల్లో ఆడపిల్లల ప్రాముఖ్యతను తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆత్మరక్షణకు చర్యలు తీసుకుంటూ వారికి స్వీయ శిక్షణను అందించాలి. ఆడపిల్లల స్వేచ్చా స్వతంత్రాలను కాపాడే విధంగా ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఈ ప్రాజెక్టు తయారీలో హర్షవర్ధిని, మానస, శ్రీవాణి, సమీనా, రషీద, నిక్షిప్త పాల్గొన్నారు.

కొత్త ఆలోచనలు.. నూతన ఆవిష్కరణలు
Comments
Please login to add a commentAdd a comment