
నిధుల్లేక నిలిచిపోయాయి
హత్నూర (సంగారెడ్డి): గ్రామీణ ప్రాంత ప్రజల అనారోగ్య సమస్యలపై వైద్యం అందించేందుకు ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలు (హెల్త్ సబ్ సెంటర్లు) నిధుల లేమితో కునారిల్లుతు న్నాయి. భవన నిర్మాణాలకు గత ప్రభుత్వం నిధులిచ్చినా అవి చాలక అసంపూర్తిగా మిగిలిపోయాయి. జిల్లాలో మంజూరైన ఆరోగ్య ఉపకేంద్రాల్లో కేవలం ఎనిమిది సెంటర్లకు మాత్రమే భవననిర్మాణ పనులు పూర్తికాగా మిగిలిన వాటికి నిర్మాణాలు ఎప్పుడు పూర్తవుతాయోనని స్థానికులు ఎదురుచూస్తున్నారు.
ఒక్కో భవనానికి రూ.20 లక్షలు చొప్పున
జిల్లాలో గత ప్రభుత్వం 124 హెల్త్ సబ్ సెంటర్ల భవన నిర్మాణాల కోసం ఒక్కొక్క దానికి రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసింది. ఇందులో 25 ఆరోగ్య ఉపకేంద్రాల భవన నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. రూ.20 లక్షలతో పూర్తిస్థాయిలో నిర్మాణం పూర్తికాదని కాంట్రాక్టర్లు మొండికేసి పనులను నిలిపివేశారు. హత్నూర మండలంలోని పలు గ్రామాలకు మంజూరైన 8 ప్రాథమిక ఆరోగ్య సబ్ సెంటర్ల భవనాల నిర్మాణాల్లో కొన్నింటికి మాత్రమే టెండర్లు పిలువగా కొంతమేర పనులు జరిగాయి. కొన్ని భవన నిర్మాణాలకు కనీసం పనులు కూడా ప్రారంభించలేకపోవడంతో గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు ఈ ప్రభుత్వం విడుదల చేస్తుందా లేదోనని ఆందోళన మొదలైంది. రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ భవన నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రమైన హత్నూరలో భవన నిర్మాణం ప్రారంభించినప్పటికీ నేటికీ పనులు పూర్తి కాలేకపోయాయి. హత్నూర ఐటీఐ కాలనీకి మంజూరైన భవన నిర్మాణం పనులు కనీసం ప్రారంభించలేదు. మండలంలోని చింతల్చెరు,బోరపట్ల, దౌల్తాబాద్, సిరిపుర, గ్రామాలకు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల భవనాలను గత ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికై నా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి భవన నిర్మాణాలను పూర్తి చేసి గ్రామీణ ప్రాంత ప్రజల అవసరాలకు వైద్యం అందించాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
రెండేళ్లు కావొస్తున్నా పూర్తికాని హెల్త్ సబ్ సెంటర్ల భవనాలు
జిల్లాలో 124 నిర్మాణాలు ప్రారంభం
పూర్తయిన భవనాలు 25 మాత్రమే
Comments
Please login to add a commentAdd a comment