ఉదయం 8 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందో తెలియక గతంలో విద్యార్థులు కొంత ఇబ్బందులకు గురయ్యే వారు కానీ ప్రస్తుతం హాల్‌టికెట్ వెనుక ఉన్న క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే సెంటర్ లొకేషన్ రావడంతో విద్యార్థులు నేరుగా ఉదయం 8 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. గతంలో నిమిషం నిబంధన ఉండటంతో విద్యార్థులు కొంత ఇబ్బందులు పడేవారు కానీ గత పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం 5 నిమిషాల అదనపు సమయం ఇవ్వడంతో విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగింది.
8 గంటలనుంచే లోపలికి...
పరీక్ష కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులను ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రాలలోనికి అనుమతించారు. పరీక్షల్లో భాగంగా బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 18,852 మంది విద్యార్థులకు గానూ 18,296 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో జనరల్ విద్యార్థులు 17,907 మంది విద్యార్థులకు గానూ 17,415 మంది విద్యార్థులు హాజరు కాగా 492 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అదేవిధంగా ఒకేషనల్ విభాగంలో 945 మంది విద్యార్థులకు 881 మంది విద్యార్థులు హాజరు కాగా 64 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లాలో 97.5 హాజరు శాతం నమోదైంది. ఇదిలా ఉండగా కలెక్టర్ వల్లూరు క్రాంతి జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని ప్రభుత్వ బాలుర కళాశాల పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి 02, డీఈసీ సభ్యులు 04, హెచ్‌పీసీ సభ్యులు 04, ఫ్లయింగ్ స్క్వాడ్ 12, సిట్టింగ్ స్క్వాడ్ 08 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.
నేటి నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు
నేటి నుంచి ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల్లో భాగంగా గురువారం విద్యార్థులకు ద్వితీయ భాష పరీక్ష జరగనుంది. విద్యార్థులు ఉదయం 8 గంటల వరకు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, చేతికి సైతం ఎలాంటి వాచీలను కూడా ధరించరాదని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment