15 నుంచి ఒంటిపూట బడులు!
నారాయణఖేడ్: వేసవి ప్రారంభం నుంచే ఎండలు ముదురుతున్నాయి. మున్ముందు పరిస్థితి మరీ తీవ్రంగా ఉండే ప్రమాదం ఉండటంతో ఈ నెల 15 నుంచి పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహించేందుకు విద్యాశాఖ నిర్ణయం తీసుకోనుంది. ప్రతీ ఏడాది మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా అదే తరహాలో చర్యలు తీసుకుంటున్నారు. కాగా ఒంటిపూట బడుల కారణంగా జిల్లాలో ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1,17,184 మంది విద్యార్థులకు ఉక్కపోతల నుంచి ఉపశమనం కలగనుంది. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పాఠశాలల కొనసాగిస్తారు. ఈనెల 21 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న కేంద్రాల్లో మాత్రం మధ్యాహ్నం పూట తరగతులు నిర్వహిస్తారు. అన్ని తరగతుల పరీక్షలు పూర్తయ్యాక ఏప్రిల్ 23 నుంచి వేసవి సెలవులను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
అంగన్‌వాడీలకు ఆలస్యమే..
అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐదేళ్లలోపు చిన్నారులు వస్తుంటారు. వీరికి వేసవి ప్రారంభంలోనే ఒంటిపూట బడులు నిర్వహించాల్సి ఉండగా అందుకు భిన్నంగా ఆలస్యంగా ఎండలు ముదిరాక ఒంటిపూట బడుల నిర్వహణ ఉత్తర్వులిస్తుంటారు. జిల్లాలో నారాయణఖేడ్, జోగిపేట, పటాన్‌చెరు, సదాశివపేట్, జహీరాబాద్ ప్రాజెక్టుల పరిధిలో 1,504అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఇందులో ఐదేళ్లలోపు చిన్నారులు 1,04,106మంది కేంద్రాలకు వస్తున్నారు. వీరికి ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు కేంద్రాన్ని నిర్వహిస్తారు. కేంద్రంలో చిన్నారులకు పౌష్టికాహారంతోపాటు విద్యాబోధన చేస్తారు. ప్రతీ ఏడాది మే మొదటి వారం తర్వాత ఒంటిపూట బడుల నిర్వహణ ఉత్తర్వులిస్తారు. అంగన్‌వాడీలకు వచ్చేది చిన్నారులే కావడంతో ప్రభుత్వ పాఠశాలలతోపాటుగానే ఒంటిపూట బడుల నిర్వహణ ఉత్తర్వులు ఇవ్వాలని తల్లిదండ్రుల నుంచి డిమాండ్ వస్తుంది.
ఏప్రిల్ 23 నుంచి వేసవి సెలవులు
ఎండలు ముదురుతున్న నేపథ్యంలో విద్యాశాఖ నిర్ణయం ప్రభుత్వ పాఠశాలల్లో 1.17లక్షలమంది విద్యార్థులకు ఉపశమనం అంగన్‌వాడీ చిన్నారులకు ఆలస్యమే..
ఉత్తర్వులు అందాల్సి ఉంది..
ఒంటిపూట బడుల నిర్వహణను ప్రతీ ఏడాది మార్చి 15 నుంచి కొనసాగిస్తారు. ఆ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఈ ఏడాది ఇంకా ఉత్తర్వులు అందాల్సి ఉంది. ఉత్తర్వులు రాగానే ఒంటిపూట బడులు నిర్వహిస్తాం.
– వెంకటేశ్వర్లు,
జిల్లా విద్యాశాఖ అధికారి సంగారెడ్డి
15 నుంచి ఒంటిపూట బడులు!
Comments
Please login to add a commentAdd a comment