సద్దుమణిగిన సాగునీటి వివాదం
కాలువలకు అడ్డుకట్ట వేసినసంగుపేట రైతులు
● కొద్దిరోజులుగా సాగు నీరందక అల్మాయిపేట గ్రామస్తుల ఇబ్బందులు ● సంగుపేట గ్రామాన్ని సందర్శించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ● నాలుగు గ్రామాలకు సాగునీరుఅందేలా పైపుల ఏర్పాటు
వట్‌పల్లి(అందోల్): యాసంగి సీజన్‌లో సింగూరు ప్రాజెక్టు కాలువల ద్వారా సేద్యానికి నీటిని నిలిపివేయడంతో పంటలకు సాగునీరందక గ్రామాల్లోని రైతుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. అందోలు మండల పరిధిలోని సంగుపేటలోని సుమారుగా 800 ఎకరాల ఆయాకట్ట కలిగిన పెద్ద చెరువు నుండి సంగుపేట, సాయిబాన్‌పేట, చందంపేట, అల్మాయిపేట గ్రామాల్లోని పంటలకు గతంలో తైబందీ చేసి కాలువల ద్వారా సేద్యానికి నీరందించేవారు. అటు తర్వాత సింగూరు కాలువల ద్వారా చాలాకాలం పాటు అల్మాయిపేట, చందంపేట, సాయిబాన్‌పేట గ్రామాలకు నీరందించడం వల్ల ఇప్పటివరకు ఎటువంటి ఇబ్బందులు కలగలేదు.
భూగర్భ జలాలు అడుగంటడంతో..
ప్రస్తుతం సింగూరు కాలువల సీసీ లైనింగ్ పనులు జరుగుతుండడంతో యాసంగి సీజన్‌కు సాగునీటి వదలకపోవడంతో పాటు భూగర్భ జలాలు అడుగంటి బోరు బావులు కూడా సరిగ్గా పోయకపోవడంతో సాగునీటి సమస్య ఏర్పడింది. దీంతో పెద్ద చెరువు నీటిని ఇతర గ్రామాలకు తరలిపోకుండా ఉండేలా సంగుపేట ప్రాంత రైతులు కాలువలకు అడ్డుకట్ట వేసి వారి గ్రామానికి మాత్రమే తరలిస్తుండటంతో వివాదం ఏర్పడింది. ఈ విషయమై అల్మాయిపేట గ్రామ రైతులు రెవెన్యూ అధికారులకు తెలియజేస్తూ వినతిపత్రాన్ని అందజేశారు. దీంతో అల్మాయిపేట గ్రామ రైతులను అక్కడికి రానివ్వకుండా గురువారం రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్‌శాఖ అధికారులు గ్రామాన్ని సందర్శించి సంగుపేట గ్రామస్తులకు నచ్చజెప్పారు. చాలాకాలంగా సంగుపేట చెరువు నుంచి అల్మాయిపేట మీదుగా బయటికుంట, దేవుని చెరువు, కుడి చెరువు మీదుగా చందంపేట, సాయిబాన్‌పేట గ్రామాలకు సాగునీరు అందేదని అధికారులు రైతులకు నచ్చజెప్పారు. కాలువలకు అడ్డుకట్టలు వేసి సాగునీటిని అడ్డుకోవడం సరికాదని సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని అధికారులు రైతులకు సూచించారు. అనంతరం సంగుపేట పెద్ద చెరువు నుంచి అల్మాయిపేటతోపాటు మూడు గ్రామాలకు నీరు తరలివెళ్లే విధంగా పైపులను ఏర్పాటు చేశారు. దీంతో రైతుల మధ్య ఏర్పడిన సాగునీటి వివాదం సద్దుమణిగింది. గ్రామాన్ని సందర్శించిన వారిలో డిప్యూటీ తహసీల్దారు మధుకర్‌రెడ్డి, ఎస్సై పాండు, ఇరిగేషన్ వర్క్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment