పాడి రైతుకు ప్రోత్సాహం
నారాయణఖేడ్: తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలోని విజయ డెయిరీ పాల సేకరణ ధర పెంపునకు చర్యలు తీసుకుంటుండటంతో జిల్లాలోని పాడి రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. తద్వారా పాడి ఉత్పత్తి సైతం పెరిగేందుకు అవకాశం ఏర్పడింది. విజయ డెయిరీ ద్వారా సేకరిస్తున్న గేదె పాల ధరలను సవరించి లీటరకు రూ.3 చొప్పున పెంచేందుకు యాజమాన్యం యోచిస్తుంది. ఇతర రాష్ట్రాల్లోని పాల దిగుమతిని తగ్గించడంతోపాటు విజయడెయిరీ పాల సేకరణ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు రాష్ట్రంలోని పాడి రైతులకు ప్రయోజనం చేకూర్చేలా విజయ డెయిరీ ధర పెంపుపై చర్యలు తీసుకుంటుంది.
లీటరుకు రూ.51
ప్రస్తుతం లీటరుకు విజయ డెయిరీ ద్వారా రైతుకు రూ.48 చెల్లిస్తున్నారు. దీన్ని రూ.3 పెంచి లీటరుకు రూ.51 చేయాలని ప్రతిపాదించారు. ఆవు పాలకు గేదె పాలతో సమానంగా చెల్లిస్తుండడం, ఆవు పాల ధర అధికంగా ఉండటంతో దాని ధరను తగ్గించాలని ఆలోచిస్తున్నారు. అత్యధికంగా గేదె పాల సేకరణ జరుగుతోంది.
2,500 మంది రైతులకు మేలు..
జిల్లాలో నారాయణఖేడ్, జహీరాబాద్, పుల్కల్, జోగిపేట, తడ్కల్, కోహీర్, సదాశివపేట, మామిడిపల్లిల్లో మినీ పాలశీథరలీకరణ కేంద్రాలు ఉన్నాయి. వీటికి తోడు 160 పాల సేకరణ కేంద్రాలు కొనసాగుతున్నాయి. 2,500 మంది రైతుల ద్వారా నిత్యం 11 వేల లీటర్ల పాల సేకరణ జరుగుతుంది. ధర పెంపు కారణంగా బయటి వ్యక్తులు, సంస్థలకు వెళ్లే పాలు నేరుగా విజయడెయిరీకి చేరుకోనున్నాయి. తద్వారా విజయ డెయిరీకి పాల సేకరణ పెరగడంతోపాటు రైతులకు ప్రయోజనం చేకూరనుంది.
జిల్లాలో 70 వేల వరకు గేదెలు
గతంలో 15 వేల లీటర్ల పాల సేరణ జిల్లాలో జరుగుతుండగా ప్రస్తుతం 11 వేల లీటర్లు సేకరిస్తున్నారు. వేసవి ప్రారంభంతో ఎండలు ముదిరిన పక్షంలో పచ్చిక బయళ్లు తగ్గడం, గ్రాసం, తాగునీటి సమస్యల కారణంగా పాల ఉత్పత్తి కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో 70 వేల వరకు గేదెలు ఉండగా, 30 వేల వరకు ఆవులు ఉన్నాయి. ఆవు పాల సేకరణ వెయ్యి లీటర్ల వరకే ఉండగా గేదె పాల సేకరణ 10 వేల వరకు ఉంది. సేకరిస్తున్న పాలలో గతంలో 5 శాతం ఫ్యాట్ (వెన్నశాతం) వస్తుండగా ప్రస్తుతం ఆ ఫ్యాట్ 6 శాతంకు పెరిగింది. పాల ధర పెంపువల్ల రైతులకు జిల్లాలో రూ.10 లక్షల వరకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.
గేదె పాల సేకరణలో రూ.3 పెంపు!
విజయ డెయిరీ ప్రతిపాదనలు
జిల్లా నిత్యం 11 వేల లీటర్లు సేకరణ
పాడి రైతులకు రూ.10 లక్షల వరకు ఆదాయం
పాడి గేదెలు ఇప్పించేందుకు కృషి
విజయ డెయిరీ పాల సేకరణ ధర పెంచాలన్న ఆలోచన వల్ల జిల్లాలోని పాడి రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఇంకా పెంపు అధికారికంగా ఉత్తర్వులు రాలేదు. ధర పెంపువల్ల గేదె పాలసేకరణ పెరుగనుంది. వ్యవసాయంతోపాటు అనుబంధంగా ఉన్న పాడి ఉత్పత్తులు పెరిగేందుకు అవకాశం ఉంది. మిత్రాలోన్, పీఎంఈజీపీ తదితర పథకాల ద్వారా బ్యాంకు రుణాలు పాడి గేదెలు ఇప్పించేందుకు కృషి చేస్తాం. పాడి సంపద పెంచి రైతులకు ప్రయోజనం జరిగేలా కృషి చేస్తాం.
– గోపాల్ సింగ్,
డిప్యూటీ డైరెక్టర్, విజయడెయిరీ, సంగారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment