ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకొని ఆత్మహత్య
రామంచలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి
చిన్నకోడూరు(సిద్దిపేట): ఉరేసుకొని రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండల పరిధిలోని రామంచలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఎడ్ల శ్రీకాంత్ రెడ్డి(40) గతంలో ఆర్మీలో పని చేసి రిటైర్‌మెంట్ అయ్యాడు. ఇతడికి భార్య శ్రీలక్ష్మితోపాటు కూతురు, తల్లి లక్ష్మి ఉన్నారు. తండ్రి తిరుపతిరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. శ్రీకాంత్ రెడ్డి దంపతులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. వ్యాపారాల నిమిత్తం అప్పులు చేసి పెట్టుబడులు పెట్టగా నష్టం రావడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీంతో మనస్తాపం చెంది రెండు రోజుల కిందట రామంచ గ్రామంలో ఉంటున్న తల్లి వద్దకు వచ్చాడు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తల్లికి ఫోన్ ద్వారా సమాచారం అందించి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ బాలకృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి భార్య శ్రీలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
రెడ్డిపల్లిలో అసిస్టెంట్ రేషన్ డీలర్
చేగుంట(తూప్రాన్): ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని రెడ్డిపల్లి కాలనీలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. రెడ్డిపల్లి కాలనీకి చెందిన మద్దూరి ప్రభాకర్ (37) అసిస్టెంట్ రేషన్ డీలర్‌గా పని చేస్తున్నాడు. నాలుగు రోజుల కిందట భార్యతో కలిసి అత్తగారింటికి వెళ్లాడు. రేషన్ పంపిణీ కోసమని ఇంటికొచ్చిన ప్రభాకర్ బుధవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి తెలిపారు.
ముత్తన్నపేట గ్రామంలో...
బెజ్జంకి(సిద్దిపేట): ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని ముత్తన్నపేట గ్రామంలో చోటు చేసుకుంది. బెజ్జంకి ఎస్‌ఐ క్రిష్ణారెడ్డి కథనం మేరకు.. గ్రామానికి చెందిన గాజె రవి(45)కి తల్లిదండ్రులు, భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. పిల్లలను బీటెక్ చదివిస్తున్నాడు. తమకున్న వ్యవసాయ భూమితోపాటు కొంత కౌలుకు తీసుకొని పంట సాగు చేస్తున్నాడు. పంటల పెట్టుబడితో పాటు చదువులకు అప్పుల చేశాడు. కొద్ది రోజులుగా అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపం చెందుతున్నాడు. బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమి సంహారక మందు తాగాడు. ఇది గమనించిన భార్య రేణుక చుట్టుపక్కల వారి సాయంతో భర్త రవిని చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించింది. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య గురువారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకొని ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకొని ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment